Begin typing your search above and press return to search.

ఫ్లైట్ టికెట్ ధరలు ఎక్కడ చూడాలో చెప్పిన డీజీసీఏ

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:30 PM GMT
ఫ్లైట్ టికెట్ ధరలు ఎక్కడ చూడాలో చెప్పిన డీజీసీఏ
X
విమాన టికెట్ ధరల్ని చెక్ చేయాల్సి వస్తే.. గూగులమ్మను అడగటం.. అది చూపించే ధరల్ని చూసుకోవటం కామన్ గా జరిగేదే. అయితే.. అలాంటి పనులతో తప్పులు దొర్లే అవకాశం ఉందంటున్నారు. విమాన టికెట్ ధరల్ని విమానయాన సంస్థలు భారీగా పెంచేసినట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. దీనిపై కేంద్ర హోంశాఖకు చెందిన కీలక అధికారిక ఒకరు చేసిన ట్వీట్ నేపథ్యంలో కొత్త రచ్చ మొదలైంది. బ్రిటన్ లో కాలేజీ ఆడ్మిషన్ల సీజన్ షురూ కావటంతో లండన్ వెళ్లే విమాన టికెట్ల ధరలు భారీగా పెంచేశాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. ఫారిన్ కు వెళ్లే వారు విమాన టికెట్ల ధరల్ని ఆయా విమాన సంస్థల వెబ్ సైట్లలో మాత్రమే చూడాలని పేర్కొంది. అందుకు భిన్నంగా గూగులమ్మలో వెతికితే.. సమాచారం మరోలా వచ్చే వీలుందని పేర్కొంది. గూగుల్ లాంటి మెటా సెర్చ్ ఇంజిన్ లో ఒక్కోసారి విమానయాన సంస్థల వెబ్ సైట్లలో ఉండే ధరల కంటే కూడా ఎక్కువ చూపించే వీలుందని చెబుతున్నారు. అందుకే.. ప్రయాణికులు టికెట్ ధరల్ని చెక్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేస్తున్నారు.

ఇంతకీ విమాన టికెట్ ధరల్ని ఎక్కడ చూసుకోవాలి? ఎలా చూసుకోవాలి? అన్న విషయాల మీద డీజీసీఏ ఎందుకు కల్పించుకుందంటే.. ఈ మధ్యన జరిగిన ఒక ఉదంతం పుణ్యమని చెప్పాలి. ఢిల్లీ - లండన్ మార్గంలో బ్రిటిష్ ఎయిర్ వేవ్ టికెట్ ధర ఆగస్టు 26 నాటికి రూ.3.95లక్షలు పలుకుతుందని.. అదే సమయంలో విస్తారాలో మాత్రం రూ.1.03లక్షల నుంచి రూ.1.47 లక్షలు ఉందని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాలోనూ కాస్త ఎక్కువ ధరకు టికెట్లను చూపిస్తున్నట్లు పేర్కొని విస్మయాన్ని వ్యక్తం చేశారు.

విమాన టికెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసాలు.. అది కూడా భారీగా ఉండటాన్ని ఆయన విమానయాన సంస్థల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈలపూై ఇష్యూ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అనుసరిస్తున్న విధానాలపై డీజీసీఏ స్పందించింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్ ధరల కోసం సంబంధిత ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్లను మాత్రమే చెక్ చేసుకోవాలని.. ఎందుకంటే మెటా సెర్చ్ ఇంజిన్లు పాయింట్ టు పాయింట్ టికెట్ ధరల్ని చూపించకపోవచ్చన్నారు.

కొన్నిసార్లు కాంబినేషన్ ఫ్లైట్లు కూడా ఉంటాయని.. వీటివల్ల చివర్లో ఉండే వాటి ధరలు అత్యధికంగా ఉంటాయని పేర్కొన్నారు. ఒకవైపు ప్రయాణికులకు సూచనలు చేస్తూనే.. మరోవైపు విమానయాన సంస్థలకు డీజీసీఏ పలు కీలక సూచనలు చేసింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో విమాన టికెట్ ధరలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలని పేర్కొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయ సర్వీసులు తక్కువగా ఉండటంతో టికెట్ ధరలు పెరిగిపోయాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.