Begin typing your search above and press return to search.

కాపులపై కుట్రలో భాగంగానే ఆ దర్శకుడి వ్యాఖ్యలు: కాపు సంఘాల ఫైర్‌!

By:  Tupaki Desk   |   10 Jan 2023 7:37 AM GMT
కాపులపై కుట్రలో భాగంగానే ఆ దర్శకుడి వ్యాఖ్యలు: కాపు సంఘాల ఫైర్‌!
X
పవన్‌ కల్యాణ్‌ - చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ కోసమే పవన్‌.. చంద్రబాబును కలిశాడని, కాపులను మరోసారి చంద్రబాబుకు గంపగుత్తగా అమ్మేయడానికి పవన్‌ ప్రయత్నిస్తున్నాడంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ క్రమంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా పవన్‌ పేరు ఎత్తకుండానే విమర్శలు సంధించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఇంతకీ రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ లో ఏముందంటే.. ‘‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని , కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..రిప్‌ కాపులు , కంగ్రాట్యులేషన్స్‌ కమ్మోళ్ళు’’ అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు.

పవన్‌ కల్యాణ్‌ , చంద్రబాబు పేర్లు ఎత్తకుండా కేవలం డబ్బు కోసమే తన సొంత కులమైన కాపులను పవన్‌ కల్యాణ్‌ కమ్మోళ్లకి (చంద్రబాబు) అమ్మేశాడనేది రామ్‌ గోపాల్‌ వర్మ ఆరోపణ.

ఈ నేపథ్యంలో కాపు సంఘాలు రామ్‌గోపాల్‌ వర్మ పై మండిపడ్డాయి. సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కాపులపై చేసిన ట్వీట్‌ను ఆంధ్రప్రదేశ్‌ కాపు సంఘాల ఐక్య సంఘాల వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు రామ్‌ గోపాల్‌ వర్మపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ల మధ్య ఇటీవల జరిగిన సమావేశంపై రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేయడం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు మంత్రులంతా.. జాతిని ముఖ్యమంత్రి జగన్‌కు తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. కాపులపై కుట్రలో భాగంగానే రామ్‌ గోపాల్‌ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం, ఐక్య సంఘాల సమితి అధ్యక్షుడు మాసాబత్తుల శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు.

మరోవైపు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ పై జనసేన సైనికులు, టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ వేసే చిల్లర మెతుకుల కోసం ఆశపడే వ్యక్తివి నీవు అంటూ ధ్వజమెత్తుతున్నారు.

కాగా ఇటీవల వైఎస్‌ జగన్‌ ను కలసి రామ్‌ గోపాల్‌ వర్మ చర్చలు జరిపిన సంగతి తెలసిందే. గత ఎన్నికల ముందు వైసీపీకి అనుకూలంగా రామ్‌ గోపాల్‌ వర్మ పలు సినిమాలను తీశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడప బిడ్డలు తదితర సినిమాలను తెరకెక్కించారు.

వచ్చే ఎన్నికల నేపథ్యంలోనూ వైసీపీకి అనుకూలంగా రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలు తీస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ నేత ఒకరు ఇందుకు పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. వ్యూహం, శపథం పేరుతో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతాయని సమాచారం. ఇప్పటికే మాదాపూర్‌ లో ఆ వైసీపీ నేత రామ్‌ గోపాల్‌ వర్మ కోసం నెలకు రూ.12 లక్షల అద్దెతో ఒక ఆఫీసు సైతం తీసుకున్నాడని చెబుతున్నారు.

రామ గోపాల్‌ వర్మ సినీ రంగంలో పవన్‌ కల్యాణ్‌ కు వ్యతిరేకంగా వ్యవహరించే వైసీపీ వ్యక్తేనని తేల్చిచెబుతున్నారు. ఇటీవల బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఆషు రెడ్డి పాదాలు నాకుతూ ఆమె పాదాల వద్ద కింద కూర్చున్న రామ్‌ గోపాల్‌ వర్మ ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీలాంటి ఏ విలువలూ లేని వ్యక్తికి కాపుల గురించి ఎందుకు అంటూ నెటిజన్లు సైతం వర్మను తిట్టిపోస్తున్నారు.