Begin typing your search above and press return to search.

వచ్చేంతవరకు వదిలేట్లు లేదుగా ?

By:  Tupaki Desk   |   12 July 2022 7:30 AM GMT
వచ్చేంతవరకు వదిలేట్లు లేదుగా ?
X
విచారణకు వచ్చేంతవరకు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వదిలిపెట్టేట్లులేదు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన విచారణ ఈనెల 21వ తేదీన జరుగుతుందని ఈడీ డిసైడ్ చేసింది. 21వ తేదీన జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అని తాజాగా మరోసారి సోనియాకు నోటీసులు పంపింది. నిజానికి సోనియా విచారణ పోయిన నెలలోనే జరగాల్సుంది. రెండుసార్లు నోటీసులిచ్చినపుడు అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని రిప్లై ఇచ్చారు.

మూడోసారి నోటీసు ఇచ్చిన తర్వాత కరోనా వైరస్ కారణంగా రాలేనని సమాధానం ఇచ్చారు. అలాగే కొద్దిరోజులు ఆసుపత్రిలో జాయినై ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాంతో విచారణను ఈడీ కూడా వాయిదా వేసింది. తర్వాత సోనియా కోలుకుని పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈడీ కూడా వెంటనే అలర్టయి విచారణకు హాజరవ్వాలంటు నోటీసులు ఇచ్చింది. మరి 21వ తేదీన సోనియా విచారణకు హాజరవుతారో లేదో చూడాల్సిందే.

ఇప్పటికే రాహుల్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. రాహుల్ కూడా ఈడీ నోటీసులిచ్చినపుడు విదేశాల్లో ఉన్నారు. అందుకనే మరో తేదీని అడిగారు. ఈడీ సరే అనగానే తర్వాత తేదీకి రాహుల్ హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు వరుసగా ఈడీ ఉన్నతాధికారులు రాహుల్ ను విచారించటం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

నాలుగు రోజుల్లో దాదాపు 50 గంటలపాటు రాహుల్ విచారణను ఎదుర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ను ఈడీ విచారిస్తోంది. వీళ్ళిద్దరు మనీల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

రాహుల్ విచారణ జరిగినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరిపుడు సోనియా విచారణకు హాజరైతే ఎలాంటి ఆందోళనలు చేస్తారో తెలీదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తామిద్దరం ఈడీ విచారణకు అతీతులమని అనుకుంటున్నట్లే అనిపిస్తోంది. తమను ఏ దర్యాప్తు సంస్థ కూడా విచారణ జరిపేందుకు లేదని అనుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే విషయమై బీజేపీ నేతలు మాట్లాడుతూ దర్యాప్తు సంస్థల ముందు ఎవరైనా ఒకటే కదా అని వాదిస్తున్నారు. చివరకు ఈ కేసు ఏమవుతుందో ఏమో.