Begin typing your search above and press return to search.

దావోస్ : మ‌న నాయ‌కుల చ‌దువు రాష్ట్రానికే వెలుగు !

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 PM GMT
దావోస్ : మ‌న నాయ‌కుల చ‌దువు రాష్ట్రానికే  వెలుగు !
X
దావోస్ కేంద్రంగా జ‌రిగే వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం మీటింగ్ కు వెళ్ల‌నున్నారు జ‌గ‌న్. ఇందుకు సీబీఐ కోర్టు కూడా అనుమ‌తి ఇచ్చింది. ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌న్ చ‌దువు, నేప‌థ్యం, ఇక్క‌డి ప్ర‌జ‌లు మరియు అవ‌కాశాలు వివ‌రించేందుకు అంత‌గా స‌రిపోతాయా అన్న డౌట్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌న నాయకుల చదువు, వాటి ఆధారంగా తీసుకున్న నిర్ణ‌యాలు ఓ సారి చూద్దాం.

ఉమ్మడి రాష్ట్రంలో డాక్ట‌ర్ చ‌దువు చ‌దివి ఇటుగా వ‌చ్చిన వైఎస్సార్ పేద‌ల జీవితంలో వెలుగు కోసం ఆరోగ్య శ్రీ ఆరంభించారు. ఓ రూపాయి డాక్ట‌రుగా పులివెందుల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎంతో ప్రాచూర్యం పొందిన ఆయ‌న త‌న చ‌దువును, త‌న నేప‌థ్యాన్నీ ఎంతో బాగా వాడుకున్నారు. పేద‌ల జీవితాల‌కు కొత్త ఆయువు ఇచ్చి దేవుడ‌య్యారు. ఇంకా చెప్పాలంటే క‌రువు సీమ‌ల్లో వ‌చ్చిన వ్య‌క్తిగా ప్ర‌జ‌ల క‌ష్టం తెలిసిన వ్య‌క్తి అయ్యారు. ఆ విధంగా పేరు తెచ్చుకున్నారు. ఇవాళ ఆరోగ్య శ్రీ కార‌ణంగా ఎన్నో జీవితాలు నిల‌దొక్కుకుని, తిరిగి కొత్త ప్ర‌యాణం ప్రారంభిస్తున్నాయి.ఆ విధంగా వైఎస్సార్ చ‌దువు ఉప‌యోగ‌ప‌డింది.

అప్పులు, వ‌డ్డీలు ఇలాంటి గోల అటుంచితే ఎక‌న‌మిక్స్ చ‌దువుకున్న చంద్ర‌బాబుకు ముందు చూపు బానే ఉంది అంటారు. అవును ! అందుకు నిద‌ర్శ‌న‌మే ఐటీ ట‌వ‌ర్స్.. హైటెక్ సిటీ.. ఇవ‌న్నీ భాగ్య న‌గ‌ర వాసి జీవితాన్నే మార్చేయి. ఎక‌న‌మిస్టు క‌నుక కాస్తో కూస్తో విదేశీ రుణాల‌నూ ఇటుగా తీసుకు రాగ‌లిగారు. వాటిలో మంచి వాటిలో చెడు వామ‌ప‌క్షాలు ఎప్పుడోమాట్లాడేయి.. క‌నుక వాటిపై చ‌ర్చ అన‌వ‌స‌రం. ఏ విధంగా చూసుకున్నా ఎంఏ ఎక‌మిక్స్ విద్యార్థిగా తిరుప‌తి కేంద్రంగా చదువుకున్న నారా వారింటి అబ్బాయి అక్క‌డే విద్యార్థి సంఘ నేత‌గా ఉంటూ త‌న రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ విధంగా చ‌దువు ఆయ‌న జీవితాన్ని రాష్ట్ర ప్ర‌గ‌తి గ‌తిని తీవ్రంగానే ప్ర‌భావితం చేసింది.

ఇదే విధంగా కేసీఆర్ కూడా ఆర్థిక శాస్త్రంపై మ‌రింత ప‌ట్టు లేక‌పోయినా బాగానే రాణించారు.ఆయ‌న ఎంఏ తెలుగు చ‌దివారు. ఓయూ కేంద్రంగా చ‌దువుకున్నారు. అయినా కూడా ఆర్థిక ప‌రిణామ గ‌తులు బాగానే తె లుసుకున్నారు.ముఖ్యంగా ఆయ‌న చ‌దువు ఓ ప్రాంతం భాష, న‌డ‌వ‌డి, మాండ‌లిక సోయ‌గం వీట‌న్నింటినీ వివ‌రించి ఉంటుంది. అందుకే ఆయ‌న‌కు తెలుగు భాష‌పై మంచి ప‌ట్టు. ఆయ‌న మాదిరిగా పాల‌న భాష‌లో మాండ‌లిక ప్ర‌ధానంగా అంత మంచి తెలుగు మాట్లాడేవారు ఇప్ప‌టి కాలంలో ఎవ్వ‌రూ లేరు.

భాష‌పై ప‌ట్టు కార‌ణంగానే ఆయ‌న ఇవాళ్టికీ రాణిస్తున్నారు. వాగ్ధాటిని మించిన వారు లేరు అని చెప్ప‌డం అతిశ‌యం కాదు.. ఆ వాగ్ధార పాల‌న విష‌యాల‌నూ ప్ర‌భావితం చేసింది. సంస్కృతి ప‌రిరక్ష‌ణ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది అన‌డం కూడా అతిశ‌యం కాదు. ఇక ఆఖ‌రుగా జ‌గ‌న్ చ‌దువు కేవ‌లం బీకాం.కానీ ఆయ‌న‌కు వ్యాపారాలు చేసిన అనుభ‌వం ఉండ‌డంతో కార్పొరేట్ శ‌క్తుల‌కు అతి చేరువ‌గా ఉండి ప్ర‌యాణించిన రోజులు ఆయ‌న జీవిత కాలాన ఉండ‌డంతో రాణించ‌గ‌లుగుతున్నారు. ఓ విధంగా కార్పొరేట్ పాలిటిక్స్ ఒక‌నాడు టీడీపీ కేరాఫ్ అయితే,ఇప్పుడు వైసీపీ కేరాఫ్ అని అనేందుకు ఆయ‌న‌కున్న ఆ కొద్ది పాటి చ‌దువు, ప‌రిజ్ఞాన‌మే అని జ‌గ‌న్ గురించి చెప్ప‌క త‌ప్ప‌దు.

అదేవిధంగాఎంబీఏ చ‌దువుకున్న కేటీఆర్ కూడా..త‌న చ‌దువును పాల‌న‌కు అనుసంధానం చేసిన తీరు ఎంతో బాగుంది. ఇక‌పై కూడా బాగుంటుంది.అందుకే ఆయ‌న కూడా జ‌గన్ కు దీటుగా దుందుడుకు చ‌ర్య‌ల‌తో దూసుకుపోతున్నారు. క‌నుక నాయ‌కుల చ‌దువు రాష్ట్రాల ప్ర‌గ‌తికి వెలుగు అని చెప్ప‌డం వాస్త‌వ దూరం కాదు. దావోస్ కేంద్రంగా జ‌రిగే వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌మావేశానికి పోయే ముందు కూడా జ‌గ‌న్ కొన్ని కామ‌ర్స్ సూత్రాలు కొన్ని ఎక‌నిమిక్స్ పాఠాలు నేర్చుకుంటే ఇంకా మేలు.అవ‌న్నీ రేప‌టి ఈ రాష్ట్ర ప్ర‌గ‌తికి దోహ‌దం అవుతాయి.