Begin typing your search above and press return to search.

అమిత్ షాను ప్రభావితం చేసిన పెద్దాయన... అందుకే జగన్... ?

By:  Tupaki Desk   |   23 Nov 2021 10:30 AM GMT
అమిత్ షాను ప్రభావితం చేసిన పెద్దాయన... అందుకే జగన్... ?
X
ఏపీ రాజకీయాల్లో ఎన్నో విశేషాలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి. నిజానికి జగన్ రాజకీయ జీవితం గట్టిగా పుష్కర కాలం ఉంటే ఉంటుంది. మరి అంతకు నాలుగు రెట్లు రాజకీయ అనుభవం కలిగిన వారు కూడా ఏపీతో అనేక రకాలుగా కనెక్ట్ అయి ఉన్నారు. వారిలో ఈ రోజు కొందరు రాజకీయాల నుంచి విరమించుకున్నా వేరే ఇతర పదవుల్లో ఉన్నా కూడా ఏపీ కోసం వారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేసే సూచనలు ఇచ్చే సలహాలు ఎన్నో ఉంటాయి.

ఏపీ అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ ఉందని జగన్ దూకుడు చేస్తే కుదరదు అన్నది ఇలా తెర వెనక ఉన్న పెద్దలు ఎలా చెప్పాలో అలాగే చెప్పారు అనుకోవాలి. జగన్ లాంటి పట్టుదల కలిగిన నాయకుడు తాను ఎంతగానో బలంగా కోరుకునే మూడు రాజధానుల చట్టాలను వెనక్కి తీసుకోవడం అంటే అనూహ్యమైన పరిణామంగానే చూడాలి.

మరి జగన్ ఇంతలా వెనక్కి పోవడం వెనక ఏం జరిగి ఉంటుంది అన్నది ఇప్పటికీ పెద్ద చర్చగానే ఉంది. జగన్ తాను తలవొగ్గలేదు, తగ్గలేదూ అంటూనే మూడు రాజధానుల చట్టానికి పాతర వేశారు. ఇది ఒక విధంగా అవతల పక్షం వారి విజయమే. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల వెనక బీజేపీ ఉంది. అమిత్ షా ఏపీకి వచ్చి కేవలం తిరుపతిలో మీటింగ్స్ కి హాజరై వెళ్ళిపోయారు అనుకుంటే పొరపాటే.

ఆయన మూడు రోజుల తిరుపతి టూర్ లో చాలానే జరిగాయిట. ఒకనాడు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసిన ఒక పెద్దాయన అమరావతి రాజధాని విషయంలో అమిత్ షా మనసు మార్చేశారు అన్న టాక్ ఉంది. ఆయన ఇచ్చిన సూచనల మేరకే అమిత్ షా మొత్తం బీజేపీ నేతలను రైతుల పాదయాత్రలో పాల్గొననమని ఆదేశాలు ఇచ్చేలా చేసింది అంటున్నారు.

అంతే కాదు అమిత్ షా తిరుపతి టూర్ లో జగన్ తో కూడా అమరావతి రాజధాని విషయం ప్రస్తావించి ఉంటారని కూడా ప్రచారం అయితే ఉంది. ఇక జగన్ మూడు రాజధానుల విషయం సాకారం కావాలీ అంటే కేంద్రం తప్పనిసరిగా సహకరించాలి. ముఖ్యంగా కర్నూల్ కి హై కోర్టు అంటే అది పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉంది. మరి కేంద్రం ఇంతకాలం రాజధానులు మూడు ఉన్నా ఒకటి ఉన్నా రాష్ట్రం ఇష్టమే అంటూ వచ్చింది.

అలాంటి కేంద్రం వైఖరిలో ఇపుడు అనూహ్యమైన మార్పు కనిపించింది. దానికి తార్కాణం అమిత్ షా తమ పార్టీ వారిని పిలిచి అమరావతి రైతులకు మద్దతు ఇమ్మని చెప్పడమే. ఇక జగన్ విషయంలో ఇంతకాలం సపోర్ట్ గా ఉంటూ వచ్చిన కేంద్రం వైఖరి ఇలా సడెన్ గా మారడానికి గల కారణాలు ఏంటి అన్న చర్చ కూడా మరోవైపు ఉంది.

మొత్తానికి కేంద్రం వైఖరి మారింది. దానికి మార్చిన వారు కూడా ఒక పెద్దాయన అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే ఏపీలో అమరావతి కి పూర్తి సపోర్ట్ చేస్తున్నట్లుగా బయటకు కనిపించేది చంద్రబాబు అయినా వెనక చాలా శక్తులు, వ్యక్తులూ ఉన్నాయని కూడా చెబుతున్నారు. వారిని ఢీ కొట్టడం అంటే కష్టమైన విషయమే. ఇక కేంద్రం అండ ఉండబట్టే ఇంతకాలం జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో గట్టిగా ముందుకు పోయింది.

అయితే ఒక్కసారిగా అమిత్ షా ఆదేశాలు, సందేశాలతో సీన్ మొత్తం మారిపోయింది. దీని వల్లనే జగన్ వ్యూహాత్మకంగానే మూడు రాజధానుల చట్టాలను వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. ఈ తెర వెనక జరిగిన రాజకీయాలు, అనేక పరిణామాలు నిజమైతే మాత్రం సమీప భవిష్యత్తులో మూడు రాజధానుల మీద కొత్త బిల్లులు అసెంబ్లీ ముఖం చూసే అవకాశం అయితే ఉండదు అంటున్నారు. మొత్తానికి కేంద్రంలోని ప్రభుత్వాన్ని అంతలా ప్రభావితం చేసిన వ్యక్తులు శక్తులు ఎవరూ అన్నదే ఇపుడు హాట్ హాట్ చర్చ.