Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. ఈ రికార్డు మాత్రం ఏపీదే!

By:  Tupaki Desk   |   18 July 2022 12:30 PM GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. ఈ రికార్డు మాత్రం ఏపీదే!
X
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం క‌త్తులు దూసుకునే రెండు రాజకీయ పార్టీలు తొలిసారిగా ఒకే అంశంపై ఒక్కటయ్యాయి. ఈ విష‌యంలో మాత్రం వారి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేక‌పోవ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు మాత్ర‌మే స‌భ్యులున్నారు. వీరిలో వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక టీడీపీకి 23 మంది, జ‌నసేన‌కు ఒక్క‌రు ఉన్నారు. అయితే టీడీపీ నుంచి న‌లుగురు, జ‌న‌సేన‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే వైఎస్సార్సీపీతో అంట కాగుతున్న విష‌యం తెలిసిందే.

జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ.. ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది లోక్ స‌భ స‌భ్యులు (టీడీపీ 3, వైఎస్సార్సీపీ 22) ద్రౌప‌ది ముర్ముకే ఓట్లేశారు.

రోజూ ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకునే రెండు పార్టీలు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక సంద‌ర్భంగా మాత్రం క‌లిసిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ రికార్డు మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేన‌ని చ‌ర్చ సాగుతోంది.

అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన తన మద్దతును ఎవ‌రికీ ప్రకటించలేదు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు సాంకేతికంగా జ‌న‌సేన పార్టీ స‌భ్యుడిగానే ఉన్నారు. అయితే ఇటీవ‌ల ప్లీన‌రీలో, వైఎస్సార్సీపీ స‌మావేశాల్లో ఆ పార్టీ జెండా మెడ‌లో వేసుకునే క‌నిపించారు. అయితే ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన కొద్ది రోజుల్లోనే రాపాక వైఎస్సార్సీపీతో అంట కాగుతున్న విష‌యం తెలిసిందే.

కాగా ప్రతిపక్ష టీడీపీ గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్ (ఎస్సీ), ఏపీజే అబ్దుల్ కలాం (మైనారిటీ), రామ్ నాథ్ కోవింద్ (ఎస్సీ)లకు మద్దతిచ్చామని చెబుతోంది. ఇప్పుడు తాజాగా ఎస్టీ అభ్యర్థికి తన మద్దతును అందించింది.