Begin typing your search above and press return to search.

వైసీపీలో తొలి అసంతృప్తి దాడి ?

By:  Tupaki Desk   |   4 April 2022 1:30 PM GMT
వైసీపీలో తొలి అసంతృప్తి దాడి ?
X
అసమ్మతి, అసంతృప్తి అక్కా చెల్లెళ్ళు. ఈ రెండింటికీ పుట్టినిల్లు రాజకీయం. మరి అక్కడ ఇవి ఎపుడూ తిష్ట వేసుకుని కూర్చుంటాయని చెప్పాలి. అసంతృప్తి లేని నేత ఎవరూ ఉండరు. అయితే వాటిని కూడా రాజకీయం పెదవుల మీద ముఖం మీద అసలు కనబడనీయకుండా కొన్నిసార్లు అడ్డగిస్తుంది. ఇక ఇదే రైట్ టైమ్ అనుకుని వాటిని బయటపెట్టగలిగేవారే సిసలైన రాజకీయ నాయకులు.

ఇపుడు అదే వరసలో వైసీపీలొ ఏలుబడిలో తొలి అసంతృప్తి వినిపిస్తోంది. నిజానికి అసంతృప్తులు, అసమ్మతులూ ఏవైనా ఉంటే ఏప్రిల్ 11 తరువాత కొత్త ఎపిసోడ్ లో చూడాల్సి ఉంటుంది అని అంతా అనుకున్నదే. కానీ తొందరపడకుండానే తనదైన శైలిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ముందే దాన్ని వినిపించారు.

ఇంతకీ ఆయన బాధ ఏంటి అంటే కొత్త జిల్లాల ఆవిర్భావ కార్యక్రమానికి కనీసం ఆయనకు ఆహ్వానం లేదుట. అలాగే ఆయన్ని ఎవరూ పిలలలేదుట. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కొత్త జిల్లాల ఆవిర్భావ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయిన తనను పిలవకపోవడం ఏంటి అని మాజీ మంత్రి దాడి మండిపడుతున్నారు.

అనకాపల్లిని జిల్లా చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. దాడి కూడా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జిల్లా కోసం ఎదురుచూశారు. ఇపుడు ఆయన ఉన్న పార్టీ దాన్ని సాకారం చేసింది. మరి తాను కీలకమైన పార్టీ పదవిలో ఉన్నా కూడా పట్టించుకోకపోవడమేంటి అని దాడి నిలదీస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటు వేళ తనకు అధికారుల నుంచి కానీ పార్టీ నుంచి కానీ పిలు[ఉ లేకపోవడం పట్ల ఆయన తీవ్రంగా కలత చెందుతున్నారు.

దాంతో తాను ఇంట్లోనే ఉంటూ టీవీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాన్ని విని ఆనందించాల్సి వచ్చిందని దాడి చెప్పుకున్నారు. మొత్తానికి చూస్తే చాలా కాలంగా దాడి పార్టీ పోకడల మీద అసంతృప్తికి గురి అయి ఉన్నారని ప్రచారం సాగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి ఆయనకు మధ్య విభేధాలు ఉన్నాయని కూడా అంటారు.

ఇక అమరనాధ్ కి మంత్రి పదవి గ్యారంటీ అని వినిపిస్తున్న వేళ దాడికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వని నేపధ్యంలో ఆయన పార్టీకి దూరం జరుగుతారు అని ప్రచారం కూడా ఉంది. ఆయన జనసేనలో చేరుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు వేళ ఆయన తన అసంతృప్తి రాగాన్ని వినిపించడం చూస్తే చాలానే అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీలో మూడేళ్ల అధికార వైభోగం తరువాత తొలి అసంతృప్త గానం దాడి మాస్టార్ దే అయిందని అంటున్నారు. ఇక మీదట మరెంత మంది నాయకులు తమ గొంతులు విప్పుతారో. ఇంకెంతలా గట్టిగా చప్పుడు చేస్తారో చూడాలి.

ఇంతకీ దాడి మాస్టార్ బాధ తనను పిలవనందుకా లేక సొంత పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న గుడివాడ మీదనా లేక తనకు పదవులు దక్కనందునా. ఏమో. అన్నీ కలిపేసి ఇలా బిగ్ సౌండ్ ఇచ్చారనే అంటున్నారు. చూడాలి మరి దాడి మాస్టార్ అడుగులు ఇక మీదట ఎటువైపు పడాతాయో ఏమో.