Begin typing your search above and press return to search.

తెలంగాణలో తొలి డ్రగ్స్ మరణం.. షాకింగ్ గా మారిన వీడియో

By:  Tupaki Desk   |   1 April 2022 5:14 AM GMT
తెలంగాణలో తొలి డ్రగ్స్ మరణం.. షాకింగ్ గా మారిన వీడియో
X
చాప కింద నీరులా డ్రగ్స్ వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన కొంతకాలంగా డ్రగ్స్.. గంజాయి భారీ ఎత్తున వినియోగించటం.. దానికి సంబంధించిన నిల్వల్ని పోలీసులు పట్టుకోవటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డ్రగ్స్ ను మితిమీరి వినియోగించిన కారణంగా మృత్యువాత పడిన తొలి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. డ్రగ్స్ వినియోగంతో మరణానికి గురైన మొదటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తర్వాతి కాలంలో డ్రగ్ పెడ్లర్ గా మారటం.. అతడ్ని అదుపులోకి తీసుకున్న క్రమంలో బయటకు వచ్చిన షాకింగ్ ఉదంతాలు ఇప్పుడు అధికారుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం ఈ మధ్యన పెరిగినట్లుగా భావించినప్పటికీ.. తమ అంచనాలకు మించి పరిస్థితి ఉందన్న విషయం తాజా ఉదంతం వెల్లడించింది.

అధికారికంగా పోలీసు రికార్డుల్లో నమోదైన తొలి డ్రగ్స్ సంబంధిత మరణం.. బాధితుడు మరణించిన తీరుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హైదరాబాద్ కు చెందిన ప్రేమ్ అనే వ్యక్తి డ్రగ్స్ కు బానిస అయ్యాడు. అనంతరం డ్రగ్స్ అమ్మే పెడ్లర్ గా మారాడు. డ్రగ్స్ కోసం తరచూ గోవాకు వెళ్లేవాడు. అక్కడ లక్ష్మీపతి అనే వ్యక్తి వద్ద సరకు కొనేవాడు. ఈ క్రమంలో డ్రగ్స్ ను అమ్ముతున్న వేళలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

అతడి దగ్గర తరచూ డ్రగ్స్ ను కొనే కస్టమర్ల వివరాల్ని సేకరించారు. వారిలో ఐటీ ఉద్యోగి రామక్రిష్ణ.. గిటార్ టీచర్ నిఖిల్.. బీటెక్ స్టూడెంట్ జీవన్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు సేకరించే సమయంలో మరో కుర్రాడు కూడా డ్రగ్స్ కొంటారని తెలిసి.. వారింటికి వెళ్లారు అధికారులు. సదరు యువకుడు మూడు రోజుల క్రితం మరణించినట్లుగా గుర్తించారు. ఆ కుర్రాడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడని.. ప్రేమ్ తో కలిసి తరచూ గోవాకు పార్టీకి వెళ్లేవాడని తెలుసుకున్నారు. తరచూ డ్రగ్స్ తీసుకోవటం.. ఓవర్ డోస్ కావటంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఈ విషయాల్ని తెలుసుకున్న పోలీసులు అతడ్ని హైదరాబాద్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అదే పనిగా డ్రగ్స్ ను వినియోగించటం వల్ల క్లరోసిస్ స్ట్రోక్ తో నరాల పటుత్వాన్ని కోల్పోయినట్లుగా తేల్చారు. ఇలాంటి ఆరోగ్య సమస్యకు ఎలాంటి చికిత్స లేదని డాక్టర్లు తేల్చేశారు. దీంతో.. మంచం మీదనే ఉన్న అతడు మూడు రోజుల క్రితం మరణించాడు.ఈ యువకుడితో పాటు నగరానికి చెందిన మరో ఏడుగురు కూడా గోవాకు వెళ్లే వారని గుర్తించారు.

ఈ ఏడుగురిలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు కాగా.. మరో నలుగురు పబ్స్ లో పని చేసే డీజేలుగా గుర్తించారు. వీరిలో కొందరు ఇప్పటికే అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తించారు. వీరిలో పలువురు పరారీలో ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకోవటం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తే.. హైదరాబాద్ మహానగరం డ్రగ్స్ వినియోగానికి ఆవాసంగా మారిందన్న సందేహం కలుగక మానదు.