Begin typing your search above and press return to search.

నాన్న వాడిన పెన్నుతోనే.. సీఎంగా తొలి ఐదు సంతకాలు.. మెస్మరైజ్ చేసిన స్టాలిన్

By:  Tupaki Desk   |   9 May 2021 3:31 AM GMT
నాన్న వాడిన పెన్నుతోనే.. సీఎంగా తొలి ఐదు సంతకాలు.. మెస్మరైజ్ చేసిన స్టాలిన్
X
ఇటీవల తమిళ నాట జరిగిన ఎన్నికల్లో పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డీఎంకే ఘన విజయం సాధించింది. సొంతంగానే 133 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఇక కూటమి పక్షాలతో కలిసి మొత్తం 157 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మే 7వ తేదీన స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరుణానిధి 2018 మే 7న దివంగతులయ్యారు. అదే రోజు స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేశారు. తాను అధికారంలోకి వస్తే తొలి వంద రోజుల్లోనే ఎన్నికల సభలకు వచ్చిన వినతులను పరిష్కరిస్తానని స్టాలిన్ ప్రకటించారు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే తొలిగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.

అయితే ఆయన ఫైళ్లపై సంతకాలు చేస్తున్న సమయంలో అందరి దృష్టి ఆయన వాడుతున్న పెన్ను పైనే పడింది. ఎందుకంటే అది తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కరుణానిధి వాడిన పెన్ను. ఆయన జీవించి ఉన్నంతకాలం అదే పెన్నుతోనే ఫైళ్లపై సంతకాలు చేసేవారు. తండ్రి మరణించిన తర్వాత స్టాలిన్ ఆ పెన్నును భద్రంగా దాచుకున్నారు. ఇప్పుడు అదే పెన్నుతో తొలి అయిదు ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఆయనకు తన తండ్రి పై ఉన్న ప్రేమాభిమానాలు చాటాయి. తొలి రోజే ఆయన సీఎంగా హుందాగా వ్యవహరించారన్న పేరు వచ్చింది.

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఫౌంటెన్ పెన్నులంటే ఎంతో ఇష్టం. చెన్నై నగరం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రోడ్డులోని ఓ దుకాణంలో వాలిటీ 69 పెన్నులను కరుణానిధి కొనేవారు. ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం అదే బ్రాండ్ పెన్నులు వాడుతూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కూడా తన తండ్రి వాడిన పెన్ను వాడటం అందరినీ ఆకట్టుకుంది.