Begin typing your search above and press return to search.

భారత్లోకి మరో కొత్త వైరస్ ఎంట్రీ.. కేరళలో తొలి నోరో వైరస్ కేసు

By:  Tupaki Desk   |   7 Jun 2022 11:17 AM GMT
భారత్లోకి మరో కొత్త వైరస్ ఎంట్రీ.. కేరళలో తొలి నోరో వైరస్ కేసు
X
కరోనా, ఒమిక్రాన్, మంకీపాక్స్ అంటూ రకరకాల వైరస్లతో ప్రపంచం గడగడలాడుతోంది. ఇంతలోనే నోరో వైరస్ అంటూ మరో మహమ్మారి ప్రజల్ని భయపెడుతోంది. తాజాగా ఈ వైరస్కుసంబంధించిన కేసును భారత్లో వైద్యులు గుర్తించడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వైరస్లు ప్రజలను భయకంపితులన్ని చేస్తున్నాయి. ఇక వానాకాలం కూడా మొదలై సీజనల్ వ్యాధులు, వైరస్లు ప్రబలడం కూడా షురూ అయింది. ఇంతలోనే మరో ముప్పు నోరో వైరస్ రూపంలో భారత్లోకి ప్రవేశించింది. మన దేశంలో ఈ వైరస్కు సంబంధించి కేసును గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వైరస్లకు పుట్టినళ్లైన కేరళలోనే ఈ కేసును గుర్తించారు. తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు ఈ వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. అసలు ఈ నోరో వైరస్ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతకమా..? దీని లక్షణాలు ఏమిటో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

నోరో వైరస్ ముఖ్య లక్షణాలు తీవ్రమైన విరేచనాలు, వాంతులు. ఇది వైరస్ అయినా దీన్ని కడుపు ప్లూ అని కూడా పిలుస్తారు. నోరో వైరస్ అంటు వ్యాధి. ఇది కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 1968లో అమెరికాలోని ఒహియోలో వైరస్‌ను తొలిసారిగా కనుగొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు సోకిన తర్వాత ఈ వైరస్ ఇటీవల దేశంలోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.

నోరో వైరస్లలో అనేక రకాలు ఉన్నాయి. ఈ వైరస్ సోకినప్పుడు చాలా మంది ఆస్పత్రికి వెళ్లకుండానే తగ్గిపోతుంది. అయితే పిల్లలు, పసి బిడ్డలు, వృద్ధుల్లో వైరస్ శక్తివంతంగా పనిచేసి ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. పాఠశాలలు, మెట్రో, ఆసుపత్రులు, మార్కెట్‌లు వంటి రద్దీ ప్రదేశాలు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు.

ఈ వైరస్ సోకిన వ్యక్తి మిలియన్ల కొద్ది నోరోవైరస్ కణాలను సృష్టించగలడు. రోగితో పరిచయం ఉన్న, వైరస్ ద్వారా కలుషితమైన నీరు త్రాగడం. కలుషితమైన ఆహారం తినడం, రోగితో ఆహారం పంచుకోవటం, చేతులు తాకడం, వైరస్ ఉన్న వ్యక్తితో సన్నిహిత, శారీరక సంబంధం కలిగి ఉండటం వల్ల నోరో వైరస్ సోకే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నోరో వైరస్ లక్షణాలు ఒకటి నుంచి మూడు రోజులు మాత్రమే ఉంటునట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్ శరీరంలో సోకి కొన్ని వారాల పాటు అయినా లక్షణాలు కనిపించకపోవచ్చని అంటున్నారు. నోరో వైరస్ సోకిన వారిలో నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు, కండరాలలో నొప్పి, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. వానాకాలం కాబట్టి ఈ లక్షణాలు సాధారణంగానే ఉంటాయని.. కానీ ఎక్కువ రోజులు ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

నోరో వైరస్ సోకకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. ఆరోగ్యకరమైన ఆహారం, నీళ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని.. పండ్లు, కూరగాయలు బాగా కడిగిన తర్వాతే తినాలని చెబుతున్నారు. ఆల్కహాల్ బేస్డ్ జెల్స్ నోరో వైరస్‌ను నిర్వీర్యం చేయలేవుని స్పష్టం చేశారు. ఎవరిలోనైనా వైరస్ సోకితే.. వెంటనే ఇంటిని శుభ్రం చేసుకోవాలని... లక్షణాలు తగ్గిపోయినా 48 గంటల పాటు బాధితులు అందరికి దూరంగా ఉండటం శ్రేయస్కరమని సూచించారు. నోరో వైరస్ సోకితే భయపడొద్దని.. తగిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ను కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.