Begin typing your search above and press return to search.

దేశంలో మొట్టమొదటి ఒమిక్రాన్ మరణం.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:32 AM GMT
దేశంలో మొట్టమొదటి ఒమిక్రాన్ మరణం.. ఎక్కడంటే?
X
విపత్తు వేళ.. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత తక్కువ నష్టంతో బయటపడే వీలుంది. తుపాను వేళ.. అందరూ అప్రమత్తంగా ఉన్నప్పుడు జరిగే నష్టానికి.. ఏ మాత్రం ప్రిపరేషన్ లేని వేళ.. అంచనాలు పెద్దగా లేవన్నట్లుగా పట్టించుకోలేని వేళలో విరుచుకుపడే తుఫానుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కరోనా విలయంలో.. ఆ కుటుంబానికి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ మీద వినిపిస్తున్న వాదనలకు.. జరుగుతున్న పరిణామాలకు పోలిక ఉండటం లేదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కీలక ఆరోగ్య నిపుణుడు ఒకరు మాట్లాడుతూ..ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా వ్యవహరిస్తోందని.. దీన్ని తక్కువగా చూడొద్దన్న విషయాన్నిఆయన చెప్పుకొచ్చారు.

ఇందుకు తగ్గట్లే దేశంలో ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటివేళ.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన ఒక పెద్ద వయస్కుడు ఒమిక్రాన్ బారిన పడటమే కాదు.. తాజాగా ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా వెల్లడించారు. బాధిత వ్యక్తికి షుగర్.. బ్లడ్ ఫ్రెషర్.. థైరాయిడ్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.

చేదు నిజం ఏమంటే..ఈ మరణం డిసెంబరు 31న చోటుచేసుకుంటే.. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం.. మరణించిన ఆరు రోజుల తర్వాత రాజస్థాన్ ప్రభుత్వం ఈ మరణాన్నిఒమిక్రాన్ గా ధ్రువీకరించటం గమనార్హం. మరణించిన పెద్దవయస్కుడి వయసు 73 ఏళ్లుగా చెబుతున్నారు. ఆయనకు జ్వరం.. దగ్గు రావటంతో డిసెంబరు 15న స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం కొవిడ్ పరీక్ష చేయటంతో పాజిటివ్ గా తేలింది. దీంతో.. జీనోమ్ సీక్వెన్స్ కు పంపటంతో ఒమిక్రాన్ వేరియంట్ అన్న విషయం నిర్ధారణ అయ్యింది.

డిసెంబరు 15న ఆసుపత్రిలో చేరిస్తే.. డిసెంబరు 25న ఒమిక్రాన్ అన్న విషయం తేలింది. అప్పటికే పోస్ట్ కొవిడ్ లక్షణాలతో బాధ పడుతున్న ఆ పెద్ద మనిషి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే డిసెంబరు 31న కన్నుమూసినట్లుగా ఉదయపూర్ అధికారులు తాజాగా వెల్లడించారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఈ పెద్ద వయస్కుడు ఎక్కడికి ప్రయాణించలేదు. ఆ మాటకు వస్తే ఆయన రెండు వ్యాక్సిన్ డోసుల్ని వేసుకున్నారు.

అంతేకాదు.. కొవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నట్లు గుర్తించిన వెంటనే ఆసుపత్రికి చేర్పించారు. అయినప్పటికీ ఆయన మరణం ఇప్పుడు కొత్త సందేహాల్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు దేశంలోని 23 రాష్ట్రాలకు వ్యాపించటమే కాదు.. ఇప్పటివరకు 2 వేల కేసుల వరకు అధికారికంగా నమోదయ్యాయి. సో.. ఒమిక్రాన్ ను సీరియస్ గా తీసుకోని వారు ఇప్పుడు మాత్రం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.