Begin typing your search above and press return to search.

దేశంలో పరుగులు పెట్టిన తోలి రైలు...ఈ రోజుతో సరిగ్గా 168 ఏళ్లు !

By:  Tupaki Desk   |   16 April 2021 10:41 AM GMT
దేశంలో పరుగులు పెట్టిన తోలి రైలు...ఈ రోజుతో సరిగ్గా 168 ఏళ్లు !
X
భారతీయ రైల్వేకు ప్రపంచంలో ఓ ఘనమైన చరిత్ర ఉంది. భారతీయ రైల్వే సేవలు మొదలై నేటితో 168 ఏళ్లు పూర్తైంది. ఈ సమయంలో మొదటి రైలు ఎప్పుడు, ఎక్కడ పరుగులు పెట్టింది , ఏ రూట్‌లో మొదటి రైలు ప్రయాణించిందో తెలుసుకుందాం .. భారతీయ రైల్వే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ ఇది. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు పరుగులు తీసింది. ప్రస్తుతం ప్రతీ రోజు 2 కోట్లకు పైగా ప్రయాణికులకు తమ సేవలని అందిస్తోంది. సరిగ్గా 168 ఏళ్ల క్రితం ఇదే రోజున ముంబైలో మొదటి ప్యాసింజర్ రైలు నడిచింది. ముంబైలోని బోరీ బుందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలు పరుగులు పెట్టింది. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ భారతీయ రైల్వే ట్విట్టర్‌లో తొలి రైలు ఫోటోను రిలీజ్ చేసింది.

1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ బుందర్ నుంచి థానే మధ్య 34 కిలోమీటర్ల దూరం మొదటి ప్యాసింజర్ రైలు నడవడం విశేషం. అప్పుడు ఆ రైలులో 400 మంది ప్రయాణించారు. ఏప్రిల్ 16న మొదటి రైలు నడిచినందుకు గుర్తుగా భారతీయ రైల్వే ఇదే రోజున ఇండియన్ రైల్ ట్రాన్స్‌ పోర్ట్ డే గా సెలబ్రేట్ చేస్తోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రయాణికులకు సేవల్ని అందిస్తున్న భారతీయ రైల్వే అనేక రికార్డుల్ని కూడా సృష్టించింది. ప్రతీ ఏటా 822 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే సేవల్ని ఉపయోగించుకోవడం అతిపెద్ద రికార్డే. ఇది ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ. భారతీయ రైల్వే నెట్వర్క్ 66,030 కిలోమీటర్లు ఉంది. ఇది భూగ్రహం చుట్టు కొలత కన్నా ఎక్కువ. భారతీయ రైల్వే గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధికారికంగా 1853 ఏప్రిల్‌లో తొలి రైలు పరుగులు తీసినా అంతకన్నా ముందే అంటే 1851 డిసెంబర్‌లో రూర్కీలో రైలును నడిపారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొత్తం 7137 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి.

వీటిలో సదరన్ రైల్వే పరిధిలో అరక్కోణం-రేణిగుంట సెక్షన్‌లో డబ్ల్యూఆర్ వెంకటనరసింహరాజువారిపేట పేరుతో రైల్వే స్టేషన్ ఉంది. దేశంలో ఉన్న రైల్వేస్టేషన్స్ అన్నింటిలో ఈ రైల్వే స్టేషన్ పేరే పెద్దది. ప్రస్తుతం దేశంలో 16 రైల్వే జోన్లు, 69 డివిజన్లు ఉన్నాయి. భారతీయ రైల్వేలో 13 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. 2015 లెక్కల ప్రకారం ప్రపంచంలో భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థల్లో భారతీయ రైల్వేది ఎనిమిదో స్థానం. ఇక దేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచింది కూడా ముంబైలోనే. 1925 ఫిబ్రవరి 3న అప్పటి బాంబే విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ మధ్య ఈ రైలు నడిచింది. ప్రస్తుతం మన దేశం రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది.