Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఇంటికి పొంచి ఉన్న పెను ప్రమాదం .. ఇంటి చుట్టూ వరద నీళ్లు !

By:  Tupaki Desk   |   16 Oct 2020 1:10 PM GMT
చంద్రబాబు ఇంటికి పొంచి ఉన్న పెను ప్రమాదం .. ఇంటి చుట్టూ వరద నీళ్లు !
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరద వరద నీటితో ఆంధ్ర ప్రదేశ్ లో నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. వరదనీటితో కృష్ణా నదిలో కూడా ప్రవాహం భారీగా పెరగడంతో టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసముంటున్నఇల్లు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలో కరకట్టపై నిర్మించిన గెస్ట్ ‌హౌస్‌ ల చుట్టూ వరదనీరు చేరింది. చంద్రబాబు నివాసం చుట్టూ కూడా వరద నీరు చేరింది. ఈ నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్‌ సగం వరకు మునిగిపోయింది. గురువారం రాత్రి మరింత వరద వచ్చే సమాచారం అందటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరకట్ట వెంట వున్న నిర్మాణాల్లో ఉన్నవారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు. ఇలా చంద్రబాబు కుటుంబంతో కలిసి నివాసముంటున్న ఇంటికి కూడా అధికారులు నోటీసులు అందించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం అమరావతి కరకట్ట వెంబడి ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవడంతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దీంతో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతేడాది కూడా ఇలాగే కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో కరకట్టపై గల చంద్రబాబు నివాసం వద్దకు వరద నీరు చేరుకుంది. ఆయన నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలి ప్యాడ్ కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబి తోట, అరటి తోటలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. రివర్ ఫ్రంట్ వ్యూభవనం, వాక్ వే కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నివాసం వరద ముంపుకి గురైంది.