Begin typing your search above and press return to search.

గందరగోళంలో అప్ఘనిస్తాన్ క్రికెటర్ల భవిష్యత్.. రషీద్ ఖాన్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   16 Aug 2021 3:30 PM GMT
గందరగోళంలో అప్ఘనిస్తాన్ క్రికెటర్ల భవిష్యత్.. రషీద్ ఖాన్ ఎక్కడ?
X
అప్ఘనిస్తాన్ తాలిబన్ వశమైంది. ఇక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు దేశాన్ని మొత్తం ఆక్రమించారు. అమెరికా సేనలు ప్రవేశించిన తర్వాత ఈ రెండు దశాబ్ధాల్లో అప్ఘాన్ తాలిబన్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చింది. అక్కడ క్రికెట్ కూడా ఎంతో పురోగతి సాధించింది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ వంటి ప్రపంచస్తాయి క్రికెటర్లు ఆ దేశం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నారు.

అయితే ఇప్పుడు అప్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోవడంతో అక్కడి క్రికెటర్ల భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది. స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్ లాంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడుతారా? ఐపీఎల్ సహా ప్రపంచ టీ20 కప్ లో ఆడుతారా? లేదా అన్నది అనుమానంగా మారింది.

అయితే ప్రస్తుతం అప్ఘనిస్తాన్ ప్రముఖ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ వారి సొంత దేశంలో లేరు. హండ్రెడ్ టోర్నీలో ఆడటానికి యూకేలో ఉన్నారు. రషీద్ ట్రెంట్ రాకెట్స్ కు, నబీ లండన్ స్పిరిట్స్ కు ఆడుతున్నారు. వీరు అక్కడి నుంచి నేరుగా యూఏఈ వచ్చి ఐపీఎల్ లో ఆడుతారు. సన్ రైజర్స్ తరుఫున వీరిద్దరూ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.

ఇప్పటికే రషీద్ ఖాన్, నబీలు ఐపీఎల్ లో ఆడుతారని బీసీసీఐ, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది. ‘ఇప్పుడే ఏం చెప్పలేమని.. కానీ రషీద్ తోపాటు ఇతర ప్లేయర్స్ ఐపీఎల్ లో పాల్గొంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఈనెల 21న హండ్రెడ్ టోర్నీ యూకేలో ముగుస్తుంది. ఆ తర్వాత రషీద్, నబీ యూకేలోనే ఉంటారో.. యూఏఈ వచ్చి ఐపీఎల్ ఆడుతారోనన్నది స్పష్టత లేదు. వాళ్లిద్దరూ రాకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.

ఇక సంక్షోభంలో ఉన్న అప్ఘనిస్తాన్ దేశంలో క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈనెలలో అప్ఘనిస్తాన్ టీం శ్రీలంక టూర్ కు కూడా వెళ్లాల్సి ఉంది. ఆపై ఆస్ట్రేలియాతో ట్రై సిరీస్ అప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. ఈ రెండూ పర్యటనలు ఇప్పుడు అప్ఘనిస్తాన్ సంక్షోభంతో రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఐపీఎల్ 2021లో అప్ఘనిస్తాన్ ప్లేయర్లు ఆడడం అనుమానంగా ఉంది. ఆ తర్వాత ప్రపంచకప్ టీ20లో కూడా అప్ఘనిస్తాన్ దేశం పాల్గొనడం కూడా డౌటే. టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ బిలో అప్ఘానిస్తాన్ ఉండగా.. ఆ గ్రూపులో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. అప్ఘానిస్థాన్ వైదొలిగితే పాయింట్లు ఇస్తారా? వేరే టీంను దించుతారా? అన్నది వేచిచూడాలి.

ఇప్పటికే తమ దేశంలో తాలిబన్ల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. మరో క్రికెటర్ నబీ కూడా ఆగస్టు 11న వరుసగా రెండు ట్వీట్లు చేశాడు. ప్రపంచదేశాల నాయకులను కాపాడాలని వేడుకున్నాడు. మా దేశాన్ని ఇలా వదిలేయకండని.. మాకు మీ సహాయం అవసరం అని ట్వీట్ చేశాడు.

అప్ఘనిస్తాన్ లో అత్యధిక పన్నులు చెల్లించే క్రికెటర్లుగా రషీద్ ఖాన్, నబీ పేరు పొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక క్రికెట్ లీగ్స్ లో వీరు పాల్గొంటున్నారు. ఇద్దరూ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరుఫున ఆడుతున్నారు. అప్ఘనిస్తాన్ లో కనీసం క్రికెట్ ప్రాక్టీస్ చేసే పరిస్థితులు లేకపోవడంతో వీళ్లు దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇక బీసీసీఐ సైతం అప్ఘనిస్తాన్ క్రికెటర్ల కోసం డెహ్రాడూన్ స్టేడియంను కేటాయించింది. ఇతర దేశాలతో సిరీస్ లను అప్గాన్ జట్టు ఇండియాలోనే ఆడుతుంటుంది.