Begin typing your search above and press return to search.

మోడీ మాటలకు రూ.కోట్లు రాలటమే కాదు.. తగ్గుతున్న ఇమేజ్ లెక్కా చెప్పేసింది

By:  Tupaki Desk   |   20 July 2021 1:30 PM GMT
మోడీ మాటలకు రూ.కోట్లు రాలటమే కాదు.. తగ్గుతున్న ఇమేజ్ లెక్కా చెప్పేసింది
X
గొప్పలు చెప్పుకోవటానికి సమయం.. సందర్భం చాలా ముఖ్యం. కాన్సెప్టు విన్నంతనే వావ్ అన్నట్లుగా ఫీలైపోయి.. జబ్బలు చరుచుకుంటే మొదటికే మోసం వచ్చే ఉదంతాలు కొన్ని చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే బీజేపీకి ఎదురైందన్న మాట వినిపిస్తోంది. మోడీ ఘనకీర్తిని వర్ణించేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అస్సలు ఇష్టపడదు. ప్రజా ప్రయోజనం ఉన్న అంశాలకు సంబంధించిన సమాచారం గురించి అడిగితే.. నో అంటే నో అని చెప్పేయటమే కాదు.. అలా ఎలా అడుగుతారు? అలా అలాంటి ఇలాంటి సీక్రెట్ కాదు.. టాప్ సీక్రెట్ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. మొత్తంగా సమాచారం ఇవ్వకుండా హ్యాండ్ ఇవ్వటం మోడీ సర్కారుకు అలవాటేనన్న మాట విపక్ష నేతలు తరచూ చెబుతుంటారు.

ఇంతకీ విషయం ఏమంటే.. ప్రధాని మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్ ఉంది కదా! ఆ ప్రోగ్రాం గురించి గొప్పలు చెప్పే కార్యక్రమాన్ని తాజాగా చేపట్టారు మోడీ అనుచరవర్గం. ఆదివారాలు మోడీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకునే అద్భుతమైన ఆ ప్రోగ్రాం పాపులర్ మాత్రమే కాదు.. ఆలిండియా రేడియోకు భారీ ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.30.80 కోట్ల ఆదాయం లభించినట్లు కేంద్ర ప్రసార శాఖ ప్రకటించింది.

తాజాగా రాజ్యసభలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మన్ కీ బాత్ తో ప్రభుత్వానికి ప్రకటనల రూపంలో భారీ ఆదాయం లభించిందని చెప్పారు. ఇక్కడి వరకు ఆగితే బాగుండేది. మోడీ భజనలో తరించే మంత్రులు.. ముంచుకొచ్చే ముప్పును పసిగట్టకుండా.. రూ.30.8 కోట్ల ఆదాయం లోతుల్లోకి వెళ్లి వివరాలు వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటివరకు ఈ భారీ మొత్తం మోడీ వారి మన్ కీ బాత్ కు వచ్చినట్లు చెప్పి.. ఏడాది వారీగా ఎంత ఆదాయం వచ్చిందో వివరంగా వెల్లడించారు. అక్కడే అసలు చిక్కు మొదలైందంటున్నారు. అదెలానంటే..

2014-15లో రూ.1.16 కోట్లు.. 2015-16లో రూ.2.81 కోట్లు.. 2016-17లో రూ.5.14 కోట్లు.. 2017-18లో రూ.10.64 కోట్లు.. 2018-19లో రూ.7.47 కోట్లు.. 2019-20లో రూ.2.56 కోట్లు వచ్చాయని.. 2020-21లో రూ.1.02 కోట్ల ఆదాయం లభించినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మొత్తంగా 2017-18లో అత్యధికంగా ఈ కార్యక్రమం ద్వారా రూ.10.64 కోట్ల ఆదాయం లభించిందన్న విషయాన్ని హైలెట్ చేశారు. అదే సమయంలో గడిచిన రెండేళ్లలో భారీగా తగ్గిన ఆదాయం లెక్క ప్రజలు.. సోషల్ మీడియా గుర్తిస్తుందన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మోడీ ప్రభ కొడిగడుతుందన్న విపక్షాల ఆరోపణలే కానీ.. దాన్ని ఫ్రూవ్ చేసే గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి కొరతను తీరుస్తూ.. తాజాగా మన్ కీ బాత్ కు వచ్చిన ఆదాయం చూస్తే..రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి అంతకంతకూ తగ్గుతూ వచ్చిన ఆదాయం చూస్తే.. మోడీ ఇమేజ్ ప్రజల్లో ఎంతలా తగ్గిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇవే గణాంకాల్ని ఎవరైనా పార్టీ చెబితే నమ్మటం కష్టం. ఏకంగా కేంద్రమంత్రి రాజ్యసభలో అధికారికంగా ప్రకటించిన ఈ గణాంకాలు మోడీ ప్రభ ఎంతలా తగ్గిందన్న విషయాన్ని చెప్పేశాయి. చూస్తుంటే.. ఈ గణాంకాల లెక్క రాబోయే రోజుల్లో రాజకీయ రగడకు దారి తీయటమే కాదు.. మోడీ మాష్టారికి మంట పుట్టే విమర్శలకు తెర తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.