Begin typing your search above and press return to search.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ?

By:  Tupaki Desk   |   26 April 2022 11:30 AM GMT
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ?
X
శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు కూడా పాకిస్థాన్ లో లాగే సాగుతోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు రెడీ అయిపోతున్నాయి. 225 సభ్యుల పార్లమెంట్ లో ఒకపుడు గొటబాయకు 154 మంది సభ్యుల మద్దతుండేది. కానీ ఇపుడు ప్రతిపక్షాల బలం మెల్లిగా పెరిగిపోతోంది. 115 మంది ఎంపీలు గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టడానికి రెడీ అయిపోయారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా చేస్తున్న ప్రయత్నాలకు 115 మంది ఎంపీల మద్దతిచ్చారు. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి గొటబాయ కుటుంబమే ప్రధాన కారణమని జనాలంతా మండిపోతున్నారు. అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రివర్గంలో గొటబాయ కుటుంబమే కీలకపాత్ర పోషిస్తోంది. అధ్యక్షుడి అనాలోచిత విధానాలు, నిర్ణయాల కారణంగా దేశ పరిస్థితి అధఃపాతాళం లోకి కూరుకుపోయింది.

ఈ కారణంగానే గడచిన నెలరోజులుగా నిత్యావసరాలు కూడా దొరక్క జనాలు నానా అవస్థలు పడుతున్నారు. కిలో పాలపొడి రు. 1500, గ్యాస్ ధర రు. 5 వేలు దాటిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలైతే ఆకాశానికి పాకిపోయింది.

ఇలాంటి పరిస్ధితులకు గొటబాయే కారణమని జనాలంతా తిరగబడ్డారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందే అంటు యావత్ దేశం ఆందోళన బాటపట్టింది. ఈ పరిస్ధితులను చూసిన తర్వాత ప్రతిపక్షాలు రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా 120 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో అధికార కూటమికి చెందిన 40 మంది ఎంపీలుండటం గమనార్హం. తొందరలోనే ఎంపీల సంతకాలు సేకరించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష నేతలంటున్నారు. దేశ ఆర్థిక పరిస్ధితులను చక్కదిద్దేందుకు గొటబాయ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మధ్యంతర ప్రభుత్వం పగ్గాలు తీసుకుని దేశంలో పరిస్థితులు చక్కదిద్దడానికి ముందుకొస్తే అధ్యక్ష బాధ్యతలు అప్పగించటానికి సిద్ధంగా ఉన్నట్లు రాజపక్సే ప్రకటించారు. క్యాబినెట్ ను రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించాలని దేశంలోని నాలుగు బౌద్ధ సంఘాలు రాజపక్సేకి లేఖలు రాయటం సంచలనంగా మారింది. దేశంలో బౌద్ధ సంఘాలు చాలా పవర్ ఫుల్లని అందరికీ తెలిసిందే. మరి పరిస్థితులు ఎటు దారితీస్తాయో చూడాల్సిందే.