Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ పర్యటనతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఆ రాష్ట్ర గవర్నర్

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:03 AM GMT
సీఎం కేసీఆర్ పర్యటనతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఆ రాష్ట్ర గవర్నర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జనగామ పర్యటన మరో ప్రముఖుడికి తిప్పలుగా మారింది. సీఎం టూర్ తో చోటు చేసుకున్న ట్రాఫిక్ జాం.. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చిక్కుకుపోయారు.

ప్రోటోకాల్ ప్రకారం చూసినప్పుడు గవర్నర్ కాన్వాయ్ ఆగకుండా.. ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అయితే.. కేసీఆర్ సభ ముగియటం.. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్ల మీదకు భారీగా వచ్చేశాయి.

దీంతో.. ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. రద్దీని క్లియర్ చేసే విషయంలో పోలీసుల తడబాటు.. హర్యానా రాష్ట్ర గవర్నర్ కు వెయిటింగ్ ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది.

ఇంతకూ సీఎం కేసీఆర్ వెళ్లిన మార్గంలో బండారు దత్తాత్రేయకు పనేం పడిందన్న విషయానికి వస్తే.. ఇటీవల మాజీ ఎంపీ జంగారెడ్డి మరణించటంతో.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించటం కోసం హనుమకొండకు వెళ్లారు.

తిరుగుప్రయాణంలో అనూహ్యంగా కేసీఆర్ పర్యటన కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జాంలో ఆయన వాహన శ్రేణి ఇరుక్కుపోయింది. సాయంత్రం ఆరు గంటల వేళకు గవర్నర్ బండారు దత్తాత్రేయ వాహనాలు జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం నిడిగొండ వద్ద అరగంటపాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. దీంతో.. గవర్నర్ బండారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే.. ఇక్కడ పోలీసుల వ్యూహ వైఫల్యమే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఒక రాష్ట్ర గవర్నర్ కాన్వాయ్ ఏ సమయానికి ఎటు వైపు వెళుతుందన్న వివరాలు స్పష్టంగా ముందే చెప్పేసే నేపథ్యంలో చూసినప్పుడు.. రద్దీని క్రమబద్ధీకరించే విషయంలో దొర్లిన తప్పులకు హర్యానా రాష్ట్ర గవర్నర్ కు తలనొప్పులుగా మారాయని చెప్పక తప్పదు.