Begin typing your search above and press return to search.

'బాణసంచా' బంద్​ చేయండి.. కేంద్రానికి గ్రీన్​ ట్రిబ్యునల్​​ నోటీసులు

By:  Tupaki Desk   |   3 Nov 2020 3:45 AM GMT
బాణసంచా బంద్​ చేయండి..  కేంద్రానికి గ్రీన్​ ట్రిబ్యునల్​​ నోటీసులు
X
దీపావళి పండుగ రోజు బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్నదంటూ ప్రకృతి ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లారు. ఈ ఏడాది రాజస్థాన్​ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించినట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో బాణసంచాపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్​ ట్రిబ్యునల్​ సూచించింది. వాయి కాలుష్యం పెరిగితే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే ఎన్జీటీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 7 నుంచి 30 వరకు టపాసులు కాల్చడంపై నిషేధించం విధించాలన్న ఆలోచనపై ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతోపాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరింది ఎన్జీటీ. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, ఢిల్లీ పోలీసు కమిషనర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అమికస్ క్యూరీగా సహాయపడటానికి ఎన్జీటీ సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వానీ, న్యాయవాది శిభానీ ఘోష్‌ను ఎన్జీటీ నియమించింది.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బాణసంచాను నిషేధించాలని సంతోష్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై ట్రిబ్యునల్ విచారించింది. అయితే గ్రీన్​ ట్రిబ్యునల్​ నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.