Begin typing your search above and press return to search.

నిఖత్ ను బంగారంగా మార్చిన తెర వెనుక హీరో.. అతడెవరంటే?

By:  Tupaki Desk   |   20 May 2022 3:28 AM GMT
నిఖత్ ను బంగారంగా మార్చిన తెర వెనుక హీరో.. అతడెవరంటే?
X
ఒక క్రీడాకారుడు లేదంటే క్రీడాకారిణి మైదానంలో చెలరేగిపోవటం వారి సహజ ప్రతిభతో పాటు.. వారి వెనుక ఒక గురువు ఉంటారు. అతడి నైపుణ్యం కూడా సదరు క్రీడాకారుడు/క్రీడాకారిణి అద్భుత ప్రతిభను ప్రదర్శించటానికి కారణమవుతుంది. తాజాగా వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా అవతరించిన మన తెలుగమ్మాయ్ నిఖత్ జరీన్ వెనుక ఒక గురువు ఉన్నారు. నిజానికి అతనే అసలు హీరో. ఆయనే కోచ్ భాస్కర్ భట్. నిజానికి నిఖత్ శైలి మొత్తాన్ని మార్చేసిన క్రెడిట్ ఆయనదే.

ఎందుకంటే నిఖత్ బ్యాక్ ఫుట్ బాక్సర్. ఈ టోర్నీ కోసం ఆమె శైలిని మార్చేయటంతో పాటు.. చక్కటి వ్యూహంతో బరిలోకి దిగి ప్రత్యర్థికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా దూకుడుగా వ్యవహరిస్తుండటం నిఖత్ కు కలిసి వచ్చింది.

బరిలోకి దిగింది మొదలు నిఖత్ ఎటాక్ పంచ్ లతో ప్రత్యర్థులపై విరుచుకుపడేలా ఆమెను తయారు చేశారు. సెమీస్ లోనూ ఆమె ఇదే తీరును ప్రదర్శించారు. ప్రతిష్ఠాత్మక ఫైనల్ పోరులోనూ తన ప్రత్యర్థి జుటామ్ సకుపై పదునైన పంచ్ లను విసిరటంతో పాటు.. తెలివిగా రింగ్ లో కదుతులూ తొలి రౌండ్ ను నిఖత్ సులువుగా ముగించింది.

రెండో రౌండ్ లో థాయ్ బాక్సర్ అటాకింగ్ మొదలు పెట్టింది. జరీన్ పంచ్ లను కాస్త దూరంగానే ఎదుర్కొంటూ 3-2 తో పైచేయి సాధించింది. కీలకమైన ఫైనల్ రౌండ్ లో మాత్రం నిఖత్ బలమైన పంచ్ లతో ఎక్కడా ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా చెలరేగింది.

థాయ్ బాక్సర్ పంచ్ లకు చిక్కకుండా వీలు చిక్కినప్పుడల్లా పవర్ ఫుల్ పంచ్ లకు తోడు జాబ్స్.. హుక్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో జడ్జీలు నిఖత్ ను ఏకగ్రీవంగా విజేతగా నిలిపారు.

రింగ్ లో నిఖత్ చెలరేగిపోతే.. ఆమెను అలా తయారు చేసిన తెర వెనుక హీరో మాత్రం భాస్కర్ భట్. నిఖత్ సాధించిన అద్భుతవిజయంలో కీలక రోల్ ప్లే చేసిన ఆయనకు ఈ విజయంలో క్రెడిట్ దక్కాల్సిందే.