Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఆనందయ్య మందుకు హైకోర్టు కూడా ఓకే

By:  Tupaki Desk   |   31 May 2021 12:08 PM GMT
బ్రేకింగ్: ఆనందయ్య మందుకు హైకోర్టు కూడా ఓకే
X
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వంతోపాటు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగిలిన మందుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పిన నేపథ్యంలో ఈ కేసు విచారిస్తున్న హైకోర్టు కూడా ఈ మందు పంపిణీకి ఆమోదం తెలిపింది.

కంటి చుక్కల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం, కోర్టు దృష్టికి తెచ్చిన నేపథ్యంలో శాంపిల్స్ సేకరించి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇక అంతకుముందు ఏపీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం.. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆనందయ్య ఇచ్చే 'పీ', ఎల్, ఎఫ్ రకం మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కంట్లో వేస్తున్న డ్రాప్స్ మందు 'కే’కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 'కే’ మందు తప్ప మిగతా ఆనందయ్య మందులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కంట్లో వేసే మందుపై పూర్తి నివేదిక 3 వారాల్లో వస్తుందని అప్పటిదాకా వేచి ఉండాలని సూచించింది.

అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి శాస్త్రీయ నిర్ధారణలు లేవని సీసీఆర్ఏఎస్ నివేదికలు తేల్చాయి. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని సూచించింది. ఆనందయ్య ఇచ్చే మందులు వాడొచ్చని స్పష్టం చేసింది.దీంతో ఇక ఈ మందు పంపిణీకి ఆనందయ్య సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని టేకప్ చేసి పంచే యోచనలో ఉన్నట్టు తెలిసింది.