Begin typing your search above and press return to search.

కోర్టు హెచ్చరించినా పార్టీ రంగులే.?

By:  Tupaki Desk   |   24 May 2020 6:12 AM GMT
కోర్టు హెచ్చరించినా పార్టీ రంగులే.?
X
హైకోర్టు హెచ్చరిస్తున్నా అధికారులు మారడం లేదు. ప్రభుత్వం ఆదేశించిందని అంటూ పార్టీ రంగులే వేస్తున్నారు. ఇక క్షేత్ర స్థాయి అధికార పార్టీ నేతలు కూడా తమ పార్టీ రంగునే ప్రభుత్వ కార్యాలయాలకు వేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి మాటను ఎవరూ వినడం లేదు. దీంతో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ రంగులు వేసిన వ్యవహారంపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 623ని రద్దు చేసింది.

అయితే హైకోర్టు హెచ్చరించినా కూడా కొందరు పార్టీ రంగులు వేస్తూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయం పైభాగంలోని రైతు భరోసా కేంద్రానికి మూడు రోజులు పార్టీ రంగులు అద్దుతున్నారు. వేసిన పార్టీ రంగులు తీసేయాలని హైకోర్టు చెబుతున్నా కార్మికులు అవే రంగులు వేస్తుండడం విస్తుపోయేలా చేస్తోంది.

ఇక విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం పాములవాక పంచాయతీ కార్యాలయంలో ఓ గదికి అధికార పార్టీ జెండాను పోలిన రంగులనే వేసేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. ఆ గదిని రైతుభరోసా కేంద్రానికి అప్పగించమన్నారు. వ్యవసాయాధికారి ఏఓ ను ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాల మేరకే రంగులు వేయిస్తున్నామన్నారు.

దీంతో ఇది ప్రభుత్వ ఆదేశమా? అధికారులు డిసైడ్ చేశారా.? స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో జరుగుతుందో తెలియదు. కానీ అధికార పార్టీ రంగులు మాత్రం పడుతూనే ఉంది. హైకోర్టు హెచ్చరించినా కూడా క్షేత్రస్థాయిలో అమలు జరగకపోవడం గమనార్హం.