Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామకు తలంటిన హైకోర్టు

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:31 AM GMT
ఎంపీ రఘురామకు తలంటిన హైకోర్టు
X
కోర్టులకు వెళుతూ ఏపీలోని అధికార పక్షాన్ని, జగన్ ను ముప్పు తిప్పలు పెడుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు అదే హైకోర్టు తలంటడం విశేషం. కోర్టులను ఆయుధాలుగా మలిచి పిటీషన్లతో బెంబేలెత్తించిన రఘురామను తాజాగా హైకోర్టు దుమ్ముదులిపింది. ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అయిన కోర్టు మెక్కు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎదురుదెబ్బ తగిలింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేయడం.. ప్రతికూల తీర్పు పొందడం చర్చనీయాంశమయ్యాయి. అప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా అమూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించి అభాసుపాలయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఫెడరేషన్(ఏపీడీడీఎఫ్) ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ కు బదిలీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటీషనర్ కు కీలక ప్రశ్నలు వేసింది. మీకేంటి నష్టమంటూ నిలదీసింది.

ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఆస్తులను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఏవిధంగా నష్టపోతారు? ఫలానా విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారు? ఒప్పందాలు చేసుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం. వ్యక్తులు, రాజకీయ పార్టీల ఆధారంగా న్యాయస్థానాలు వ్యాజ్యాలు పరిష్కరించవు అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రఘురామ పిటీషన్ పై అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం చట్ట, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదా మాత్రమే మేం పరిశీలిస్తాం అని స్పష్టం చేసింది.

ఇన్నాళ్లు రఘురామ పిటీషన్లతో ప్రతీసారి ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు ఏర్పడేవి. కానీ తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రఘురామకు దిమ్మదిరిగి బొమ్మ కనపడిందని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.