Begin typing your search above and press return to search.

వీడు మామూలోడు కాడు.. 8 మంది భార్యలతో ఒకే ఇంట్లో కాపురం

By:  Tupaki Desk   |   4 Feb 2022 3:07 AM GMT
వీడు మామూలోడు కాడు.. 8 మంది భార్యలతో ఒకే ఇంట్లో కాపురం
X
ఒక్క పెళ్లాం దెబ్బకే కిందా మీదా పడిపోయే పరిస్థితి. అలాంటిది ఏకంగా ఎనిమిది మంది భార్యలతో.. అది కూడా అందరితో కలిసి ఒకే ఇంట్లో ఉండి కాపురం చేయటం మామూలు విషయం కాదు. అద్భుతం లాంటి ఈ మేజిక్ గురించి విన్నంతనే.. అప్రయత్నంగా.. వీడు మామూలోడు కాదు సామి అనుకోకుండా ఉండలేం. అన్నింటికంటే అవాక్కు అయ్యే విషయం ఏమంటే.. ఈ ఎనిమిది మంది భార్యలతో ఫుల్ హ్యాపీగా కాపురం చేస్తున్నట్లుగా చెప్పుకొస్తాడు. ఇంతకూ ఇతగాడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎనిమిది మందిని ఎలా పెళ్లాడాడు? ఒకే ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నాడన్న వివరాల్లోకి వెళితే..

థాయ్ లాండ్ కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ అనే వ్యక్తి టాటూ ఆర్టిస్టుగా పని చేస్తుంటాడు. అతగాడికి తాను చేసే పనితో కంటే కూడా.. అతగాడి వ్యక్తిగత విషయమే ప్రముఖుడిగా మార్చింది. మిగిలిన వారికి భిన్నంగా చేసింది. ఇంతకూవిషయం ఏమంటే.. ఓంగ్ కు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది భార్యలు ఉన్న విషయాన్ని అతడో టీవీ షోలో వెల్లడించటం.. ఈ ఉదంతం వైరల్ గా మారినట్లుగా పేర్కొన్నాడు.

ఇంట్లో ఉండే ఒక్క భార్యతో వేగటమే కష్టంగా ఉంటే.. ఎనిమిది మంది భార్యల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడన్న సందేహం వచ్చిన వారికి.. అతడు చెప్పిన సమాధానాలు వింటే షాకులు తినాల్సిందే. తనకున్న ఎనిమిది మంది భార్యల్ని ఒకే ఇంట్లో.. అది కూడా ఒక్కో గదిలో ఇద్దరు చొప్పున ఉంచి కాపురం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇంతకూ ఇతగాడు చేసుకున్న ఎనిమిది పెళ్లిళ్లు ప్రేమ వివాహాలేనని.. అందరికి చెప్పిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

తన మొదటి భార్యను తన స్నేహితుడి పెళ్లిలో చూసి ప్రేమించినట్లు పేర్కొన్నారు. తర్వాత ఆమెను పెళ్లాడిన తర్వాత తన రెండో భార్యను మార్కెట్లో చూసి చేసుకుంటే.. మూడో భార్యను ఆసుపత్రిలో.. నాలుగు.. ఐదు.. ఆరో భార్యల్ని సోషల్ మీడియాలో చూసి ప్రేమించి పెళ్లాడట.

ఇక.. తన తల్లితో కలిసి గుడికి వెళ్లినప్పుడు తన ఏడో భార్యను చూసి.. ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఎనిమిదో పెళ్లి మరీ విచిత్రంగా చెప్పాలి. తన నలుగురు భార్యలతో కలిసి సరదా ట్రిప్ కు వెళ్లే వేళలో.. ఎనిమిదో భార్యను చూసి ఫిదా అయ్యాయని.. అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. తన భార్యలు చాలా మంది వారని.. చాలా అందంగా ఉంటారని చెప్పిన అతడు.. వారంతా చాలా మంచివారని చెప్పుకొచ్చాడు. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఏమైనా.. ఎనిమిది మంది అమ్మాయిలతో పెళ్లి చేసుకొని ఇంత హ్యాపీగా ఉండటం మాత్రం సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.