Begin typing your search above and press return to search.

ట్వీట్ చూసి సాయం చేసేందుకు భారీ సాహసం చేసిన హైదరాబాదీ జంట

By:  Tupaki Desk   |   25 May 2020 5:45 AM GMT
ట్వీట్ చూసి సాయం చేసేందుకు భారీ సాహసం చేసిన హైదరాబాదీ జంట
X
ఒక హైదరాబాదీ జంట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. విదేశాల నుంచి వచ్చిన వారు పెయిడ్ క్వారంటైన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. అలా హోటల్ కు వచ్చిన ఇద్దరు మహిళలు(అందులో ఒకరు గర్భిణి)..క్వారంటైన్ కు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో హోటల్ లాబీల్లోనే ఉండిపోయారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో నిద్ర లేచిన రాజేంద్ర అగర్వాల్ అనే వ్యక్తి సాయం కోసం పెట్టిన ట్వీట్ ను చూశారు.

ఆ వెంటనే భార్యను లేపి.. విషయం చెప్పారు. మరింకేమీ ఆలస్యం చేయకుండా.. బయట అమల్లో ఉన్న కర్ఫ్యూను పట్టించుకోకుండా హోటల్ కు వెళ్లారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి.. లాబీల్లో ఉన్న మహిళలు చెల్లించాల్సిన రూ.22,500 మొత్తాన్ని తామే కట్టేశారు. వారికి చక్కటి వసతి ఇవ్వాలనికోరి వెళ్లిపోయారు.

ఈ ఎపిసోడ్ లో సదరు జంటను అభినందించాల్సిన అంశం ఏమంటే.. తామింత సాయం చేసినా.. సదరు మహిళల్ని కలవటం కానీ.. వారితో మాట్లాడటం కానీ చేయలేదు. చేసే దానం కుడి చేత్తో చేస్తే.. ఎడమ చేతికి తెలీదన్న చందంగా.. కష్టంలో ఉన్న మహిళలకు సాయం చేసేందుకు సదరు హైదరాబాదీ జంటను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. తాను చేసిన ట్వీట్ కు స్పందించిన ఒక జంట తెల్లవారుజామున నాలుగు గంటలకు చేసిన సాహసాన్ని ట్విట్టర్ లో పేర్కొన్న ఎంబీటీ నేత.. సదరు జంటకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేయాలని కోరారు.