Begin typing your search above and press return to search.

ఆదర్శ గ్రామం ... గ్రామస్తులే కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్మించుకున్నారు , ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   27 May 2021 4:30 PM GMT
ఆదర్శ గ్రామం ...  గ్రామస్తులే కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్మించుకున్నారు , ఎక్కడంటే  !
X
గతంలో 'కరోనా మహమ్మారి'తో అల్లాడిపోయిన గ్రామం అది. కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్నప్పుడు విలవిలలాడింది. ఆ బాధాకర అనుభవాల నుంచి కోలుకుని గ్రామస్థులు తమ కష్టాలు తీర్చే దారినివారే వెతుక్కున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం కోసం ఎదురు చూపులు, ప్రైవేటు ఆసుపత్రులలో పెద్ద మొత్తంలో ఖర్చుల కష్టాల నుంచి గట్టెక్కాలని సంకల్పించిన ఆ గ్రామం సమష్టి కృషితో ప్రత్యామ్నాయం చూసుకుంది. 30 పడకల కరోనా వైరస్ కేర్ సెంటర్‌ ను ఏర్పాటు చేసుకుని తమ గ్రామంలోనే కాకుండా, సమీప పల్లెల ప్రజలకు కూడా ఆసరాగా నిలిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఊళ్లోని వారంతా స్పందించడంతో సేకరించిన రూ.50 లక్షలతో దాదాపుగా సొంత ఆస్పత్రి నిర్మించుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడ గ్రామస్థులు కరోనా వైరస్ కేర్ సెంటర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతోంది. 250 పడకలతో మరో ఐసోలేషన్ కేంద్రాన్ని కూడా గ్రామంలోని దాతల సహకారంతో సిద్ధం చేశారు.

కరోనా పల్లెల మీద ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అనేక గ్రామాల్లో కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో సెకండ్ వేవ్‌ లో సామాన్యులు సతమతం అవుతున్నారు. ఇరుకు గదుల్లో నివాసం, తగిన సదుపాయాలు కూడా లేని ఇళ్లల్లో నివసిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభుత్వం కూడా గ్రామాలలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కరోనా సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వలసలు వెళ్లి వచ్చే వారి కోసం ప్రతి పంచాయతీ కార్యాలయంలో ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు క్వారంటైన్ చేయడానికి వినియోగించారు. అప్పట్లో అవి ఫలితాన్నిచ్చాయి. కానీ ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగా ప్రభుత్వం పంచాయతీల్లో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ ఆదేశాలతో అధికారులు ఇప్పుడిప్పుడే కదులుతున్నారు. మానవత్వంతో ఆలోచించి ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ముందుకొచ్చారు'' అని ఈ కరోనా కేర్ సెంటర్ నిర్వాహకుల్లో ఒకరైన మండ రాజారెడ్డి అన్నారు. వైద్యం కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, బెడ్ దొరకాలంటే గగనంగా ఉందనీ, అలాంటి సమయంలో ఇబ్బందులు తొలగించాలనే సంకల్ప బలంతో ఇది సాధ్యమైందని రాజారెడ్డి అన్నారు.

ప్రభుత్వం ప్రకటన ఆచరణలోకి రావడానికి ఎంత సమయం పడుతుందన్నది తెలియని చాలా గ్రామాల్లో స్థానికులే సొంతంగా కరోనా వైరస్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐదు, పది పడకల కరోనా వైరస్ కేర్ సెంటర్లు అనేక గ్రామాల్లో ఏర్పాటయ్యాయి. కరోనా బాధితుల మూలంగా ఇళ్లల్లో ఉంటున్న వారికి సమస్య రాకుండా విడిగా ఉండేందుకు ఇలాంటి కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు చందాలు వేసుకుని ఇలాంటి కరోనా వైరస్ కేర్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఏఎన్ ఎం, ఆశా కార్యకర్తల సహకారంతో రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు అనువుగా సిద్ధం చేస్తున్నారు. కాకినాడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లల మామిడాడ ఆధ్యాత్మిక క్షేత్రం. గ్రామంలో అత్యధికులు వ్యవసాయం, వివిధ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారానికి ఆ గ్రామం పెట్టింది పేరు.

గ్రామస్తులంతా వినూత్నంగా ఆలోచించి సుమారు రూ. 50 లక్షలు సేకరించారు. ఆ డబ్బుతో ఏకంగా కరోనా వైరస్ ఆసుపత్రినే నిర్మించారు. ఫస్ట్‌ వేవ్‌ లో మా గ్రామంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ అనుభవంతో కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది విరాళాలు అందించారు. 30 బెడ్లతో పాటు అన్నిబెడ్లకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చేశాం. అత్యవసరం పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచాం అని గ్రామస్థులు చెప్పారు. సొంతంగా కోవిడ్ సెంటర్ నిర్మించుకోవడం ద్వారా గొల్లల మామిడాడ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ఈ గ్రామస్తులు చేసిన ప్రయత్నాన్ని అభినందించక తప్పదు. మామిడాడ వాసులు తమ సంకల్పంతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబెట్టిన వారవుతారు అని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు, ఐసోలేషన్ కేంద్రాలన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రోగులకు రక్షణ ఏర్పాట్లు పూర్తిగా ఉండాలి. వాటిని వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులు పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది.అలాంటి నిబంధనలను పాటిస్తూ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన జర్నలిస్ట్ శివన్నారాయణ రెడ్డి చొరవతో "మన ఊరు-ఊరికోసం" పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో మొదలైన ప్రయత్నం ఇప్పుడు కార్యరూపం దాల్చడం పట్ల పలువరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.