Begin typing your search above and press return to search.

సదర్ ఉత్సవ వేళ.. తలసాని కొడుకు ఇమేజ్ మరోసారి డ్యామేజ్

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:48 AM GMT
సదర్ ఉత్సవ వేళ.. తలసాని కొడుకు ఇమేజ్ మరోసారి డ్యామేజ్
X
అదేం దరిద్రమో కానీ కొంతమందికి అదే పనిగా ఎదురయ్యే సవాళ్లను చూస్తే.. ప్రపంచంలోని పరీక్షలన్ని వీళ్లకే ఎందుకు? అన్న భావన కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొనే సాయి నెత్తికి మరో వివాదం చుట్టుకుంది. తాజాగా నిర్వహించిన సదర్ వేడుకలో అతడో వివాదంలో ఇరుక్కున్న వైనం ఇప్పుడు వార్తాంశంగా మారింది.

సదర్ ఉత్సవంలో పాల్గొన్న ఆయన తిరిగి వెళుతున్న వేళ.. ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఒక వ్యక్తి మీదకు ఎక్కిన తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. ఈ ఉదంతంలో స్వల్ప గాయాలు అయినప్పటికీ.. మంత్రి గారి అబ్బాయి కావటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత అధికారం చేతిలో ఉంటే మాత్రం అంత అహంకారమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ ఈ ఉదంతంలో ఇందులో అతడి తప్పు ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవటం ఆయన్ను ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పక తప్పదు. రాజకీయంగా ఎదగాలన్న తపన భారీగా ఉన్నప్పటికీ.. తరచూ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది.

నిజానికి ఈ వివాదాలే ఆయనకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని మిస్ అయ్యేలా చేసిందని చెబుతారు. 2019లోజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు సాయి యాదవ్. ఒకే రాజకీయ కుటుంబంలోని వారికి భారీప్రాధాన్యతను ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు ఇష్టపడరు. ఇందుకు భిన్నంగా తలసానికి మంత్రి పదవిని ఇచ్చి.. ఆయన కుమారుడికి పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వటంతో.. కేసీఆర్ దగ్గర తలసానికి ఉన్న పలుకుబడి ఎంతన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా చేసింది.

ప్రస్తుతం కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డితో నాటి ఎన్నికల్లో తలపడ్డారు సాయి యాదవ్. తెలుగు.. ఇంగ్లిషు.. హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటమే కాదు..అనర్గళంగా మాట్లాడటం.. పొలిటికల్ పంచ్ లు వేసే విషయంలో మంచి నేర్పున్న సాయి గెలుపు నల్లేరు మీద నడకలా భావించారు. దీనికి తోడు తండ్రి ఇమేజ్ తనకు కలిసి వస్తుందని.. తమకు మాదిరి ఆర్థిక దన్ను ఎన్నికల్లో విజయానికి సాయం చేస్తుందని భావించారు. కానీ.. అనూహ్యంగా కిషన్ రెడ్డి విజయం సాధించటంతో..అతి పిన్న వయసులో లోక్ సభలో కూర్చోవటం ఖాయమనుకున్న సాయి ఆశలన్ని వమ్ము అయ్యాయి.

ఈ ఓటమికి కారణం.. గతంలో ఆయన మీద ఉన్న ఆరోపణలు కూడా కారణంగా చెబుతారు. పలుఆరోపణలు ఉన్న సాయి వర్సెస్ ఎలాంటి విమర్శలు లేని క్లీన్ చిట్ లాంటి కిషన్ రెడ్డి మీద పోటీ అన్న ప్రచారం కూడా తలసాని కొడుక్కి కలిసి రాలేదని చెబుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన తర్వాత ఇమేజ్ బిల్డింగ్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అతగాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపిస్తోంది. తాజా ఉదంతాన్ని చూస్తే.. సదర్ ఉత్సవానికి హాజరై తిరిగి వెళుతున్న వేళ.. ఆయన కారు ఒక వ్యక్తి మీదకు ఎక్కింది. దీనిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సాయి కారు ఎక్కిన వ్యక్తి కాలుకు గాయం కావటంతో బాధితుడి కుటుంబ సభ్యులు.. స్థానికులు సాయితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరువురికి సర్ది చెప్పి తలసాని కుమారుడ్ని ఇంటికి పంపించేశారు. ఈ ఉదంతంలో సాయి మరికాస్తపరిణితి ప్రదర్శిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుకోకుండా జరిగిన ఉదంతంలో గాయపడిన వ్యక్తిని వెంటనే తన కారులో తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించి.. వారి కుటుంబ సభ్యులకు సర్దిజెప్పే ప్రయత్నం చేస్తే మరింత బాగుండేదని.. ఇలాంటి తీరు తలసాని కొడుకులో మిస్ కావటాన్ని పలువురు ప్రస్తావిస్తుండటం గమనార్హం. ఇదంతా చూస్తే.. టైం బ్యాడ్ అనుకోవాలా? పరీక్ష పెట్టే కాలానికి తగినట్లుగా సాయి స్పందించటం లేదనాలా?