Begin typing your search above and press return to search.

మార్స్ పై నాసా అద్భుతం.. ఆ మినీ హెలికాఫ్టర్ సృష్టికర్త మన భారతీయుడే !

By:  Tupaki Desk   |   20 April 2021 11:45 AM GMT
మార్స్ పై నాసా అద్భుతం.. ఆ మినీ హెలికాఫ్టర్ సృష్టికర్త మన భారతీయుడే !
X
మార్స్ పై మినీ హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. భూ గ్రాహం పై కాకుండా , ఇతర గ్రాహం పై ఓ హెలికాప్టర్ ఎగరడం ఇదే తొలిసారి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నాసా చరిత్ర సృష్టిస్తే .. ఆ చరిత్ర కి సృష్టి కర్త మన భారతీయుడు కావడం నిజంగా గర్వకారణం. అరుణగ్రహం పై ఎగిరిన మినీ హెలికాప్టర్ రూపకర్త భారత సంతతి వాడే. అతనే బాబ్ బలరామ్ అనే చీఫ్ ఇంజనీర్. ఈయన నాసాలో దాదాపు 20 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్ధి అయిన బలరామ్ 1975-80 బ్యాచ్ కి చెందినవాడు. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ఈయన బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తరువాత అమెరికాలోని అతి ప్రాచీన రెన్ సీలర్ పాలిటెక్నీక్ టెక్నాలజికల్ రీసర్చ్ యూనివర్సిటీలో ఎం.ఎస్ కంప్యూటర్స్ చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి పీ హెచ్ డీ పట్టా కూడా అందుకున్నాడు.

అపోలో మూన్ లాండింగ్ మిషన్ ఇతనికి అంతరిక్షం, సైన్స్ పై ఆసక్తిని పెరిగేలా చేసింది. అప్పటి నుంచి ముఖ్యంగా మార్స్ పై దిగే మినీ రోబో హెలికాఫ్టర్ రూపకల్పన కోసం కృషి చేస్తూ వచ్చానని బలరామ్ తెలిపారు. నాసాలోని మార్క్ హెలికాఫ్టర్ స్కౌట్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్న ఈయన మరిన్ని సరికొత్త ప్రాజెక్టుల కృషిలో నిమగ్నమై ఉన్నాడట. బలరామ్ వంటి భారత సంతతి ఇంజనీర్లు తమ సంస్థకే గర్వకారణమని నాసా హర్షం వ్యక్తం చేస్తోంది. చారిత్రక ఇన్‌ జెన్యుటీ హెలికాఫ్టర్‌ ప్రయోగంతో ఆయన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. మార్స్‌పై ఎగిరిన ఆ హెలికాఫ్టర్‌ భవిష్యత్తులో అంగారకుడిపై ఎన్నో ప్రయోగాలకు ఊతమిచ్చింది. దీంతో అంగారకుడిపై ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్ ప్రయోగాన్ని చూసి ప్రపంచదేశాలు అబ్బురపడుతున్నాయి. ఇప్పటికే నాసా నిర్వహిస్తున్న ఎన్నో అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయులు భాగస్వాములవుతున్నారు. గతంలో కల్పనా చావ్లా, సునీతా నారాయణ్ వంటి మహిళలు సైతం నాసా ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు చారిత్రక ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌ ప్రయోగంలోనూ భారత సంతతికి చెందిన బాబ్‌ బలరామ్‌ అనే ఇంజనీర్‌ కీలక పాత్ర వహించడం గర్వకారణం.