Begin typing your search above and press return to search.

తెలంగాణకు వచ్చిన 'జాకీ' సంస్థ.. ఏపీకి రావాల్సిందా?

By:  Tupaki Desk   |   22 Nov 2022 3:30 AM GMT
తెలంగాణకు వచ్చిన జాకీ సంస్థ.. ఏపీకి రావాల్సిందా?
X
మూడు..నాలుగు రోజుల క్రితం తెలంగాణలోని చాలా ప్రధాన దిన పత్రికలు ఒక వార్తను పబ్లిష్ చేశాయి. దాని సారాంశం.. లోదుస్తుల తయారీ సంస్థగా.. యూత్ నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ వాడే పాపులర్ బ్రాండ్.. జాకీ. ఈ సంస్థ తన తయారీని తెలంగాణలో పెట్టనుందని.. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో చేసుకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిసిన జాకీ ప్రతినిధులు.. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణకు అదే పనిగా కంపెనీలు వస్తున్న నేపథ్యంలో.. జాకీ (కంపెనీ పేరు వేరే. పేజ్ ఇండస్ట్రీ. కానీ జాకీ అన్నది పాపులర్ బ్రాండ్ కాబట్టి ఆ పేరుతో మాట్లాడుకుంటే అర్థం కావటం చాలా ఈజీగా ఉంటుంది) కూడా అలానే వచ్చిన సంస్థగా చాలామంది భావించారు.

అయితే.. అసలు లెక్క వేరే ఉందని.. తొలుత ఈ సంస్థ తన తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు మక్కువ చూపించిందని.. అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటంతో ఆ కంపెనీ ఏపీని వదిలేసి తెలంగాణకు చేరుకున్న సంచలన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ దీనికి సంబంధించిన ఒక షాకింగ్ కథనాన్ని పబ్లిష్ చేసింది.

ఏపీలో పరిశ్రమలను స్థాపించాలంటే చుక్కలు కనిపిస్తాయని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు చాలానే ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం అప్పుడప్పుడు వినిపించినా.. జాకీ విషయంలో మాత్రం నిజంగానే అలానే జరిగిందని చెబుతున్నారు. గతంలోనూ ఏపీలో ఏర్పాటు చేయాల్సిన సంస్థ.. చివర్లో ప్రభుత్వం తీరుకు బెంబేలెత్తిపోయి ఏపీని వదిలేసిన వైనం అప్పట్లో రచ్చగా మారింది.

తాజాగా జాకీ విషయంలోనూ అలాంటిదే జరిగిందన్న మాట వినిపిస్తోంది. జాకీ సంస్థ ఏపీలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించగా.. ఏపీ ప్రభుత్వం సరిగా సహకరించక పోవడం తో ఆ సంస్థ తెలంగాణకు వెళ్లినట్లుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి . షేరు మార్కెట్ లో ఈ కంపెనీ షేరు ధర ఒక్కొక్కటి రూ.45వేలు. అంతటి ప్రతిష్టాత్మకమైన కంపెనీకి ఏపీ అధికార పార్టీ సరిగా పట్టించుకోని ఉంటె ఇలా జరిగి ఉండేది కాదు అని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

తెలంగాణకు వస్తామన్న మాట చెప్పినంతనే.. సదరు ప్రభుత్వ పెద్దలు కంపెనీని సాదరంగా ఆహ్వానించటమే కాదు.. వారికి అవసరమైన సకల సౌకర్యాల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు. నిజానిక జాకీ సంస్థను ఏర్పాటు చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం 2017లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. అనుమతులు.. భూకేటాయింపులు జరిగిపోయాయి. అనంతపురం రాప్తాడు వద్ద అప్పటి ప్రభుత్వం 27 ఎకరాల్ని కేటాయించింది. ఈ సంస్థ తన పరిశ్రమను ప్రారంభిస్తే.. 6500 మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో అంచనా వేశారు. ఇందుకోసం జపాన్ నుంచి అత్యాధునిక యంత్రాల్ని తీసుకురావాలని ప్లాన్ చేశారు.

అయితే.. సదరు కంపెనీ పరిశ్రమ స్థాపనకు అవసరమైన పనులు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారటం ఇక్కడ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం తో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.