Begin typing your search above and press return to search.

చైనా పేరు చెప్పి ఇమ్రాన్ కి ముచ్చెమటలు పట్టించిన జర్నలిస్ట్ .. ఏం అడిగాడంటే!

By:  Tupaki Desk   |   21 Jun 2021 8:30 AM GMT
చైనా పేరు చెప్పి ఇమ్రాన్ కి ముచ్చెమటలు పట్టించిన జర్నలిస్ట్  .. ఏం అడిగాడంటే!
X
పాకిస్థాన్ , డ్రాగన్ కంట్రీ అయిన చైనాకి మిత్రం దేశం. ఏ సమయంలో అయినా , ఏ విషయంలో అయినా ప్రపంచంలో ఉండే ఏ దేశాన్ని అయినా పాకిస్థాన్ ప్రశ్నిస్తుంది. కానీ, ఒక్క చైనా విషయంలో మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. దీనికి ప్రధాన కారణం అందరికి తెలిసిందే. చైనా పై పాక్ కి ఉన్న ప్రేమనే. ఈ సంగతి అందరికి ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే , తాజాగా మరోసారి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ .. చైనా పై ఉండే ప్రేమని చాటుకున్నారు. ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో చైనా తీరుని ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నిస్తే ., దానికి సరైన సమాధానం చెప్పలేక ఇమ్రాన్‌ ఖాన్‌ నీళ్లు నములుతూ , అనవసరంగా కాశ్మీర్ ను తీసుకొచ్చి దాటవేత ధోరణిని ప్రదర్శించాడు.

వివరాల్లోకి వెళ్తే .. పాక్ పీఎం ఇమ్రాన్‌ ఖాన్‌ ను, హెచ్‌ బీవో అక్సియోస్‌ జర్నలిస్ట్‌ జోనాథన్‌ స్వాన్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ ను పలు ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడిగాడు. ఇక ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాడాలని ఇస్లాం స్టేట్‌ నేతలకు గత ఏడాది ఇమ్రాన్‌ లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించిన స్వాన్‌, చైనా విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించాడు. మీ పొరుగున పశ్చిమ చైనాలో అక్కడి ప్రభుత్వం పది లక్షల మందికి పైగా ఉయిగుర్లను బంధించి, హింసిస్తోంది. బలవంతంగా వాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయిస్తోంది. క్సింగ్‌ జియాంగ్‌ లో మసీదుల్ని కూలగొట్టింది. రంజాన్‌ వేళ పవిత్రంగా ఉపవాసం పాటించేవాళ్లను శిక్షించింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్న ఇస్లామోఫోబియాను నిలదీసే మీరు, పొరుగునే ఉన్న చైనాను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. ఆధారాలున్నా, అవకాశాలు దొరుకుతున్న నిలదీయలేక ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని స్వాన్‌ సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నించాడు.

అయితే , జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్పలేక, ఇది అప్రస్తుతమైన అంశమని, విపత్కర పరిస్థితుల్లో పాక్‌ ను ఆదుకున్న చైనాతో తమకు గాఢమైన స్నేహం ఉందని, నాలుగు గోడల మధ్యే ఏ విషయమైనా మాట్లాడుకుంటామని ఇమ్రాన్‌ స్పష్టం చేశాడు. అయితే ఇది అంత తీవ్రమైన సమస్య కాదని భావిస్తున్నారా, అని స్వాన్‌ అడిగితే.. కశ్మీర్‌ లో లక్షల మంది భారతీయ సైన్యం ఉన్నారని, ఇది అంతకంటే తీవ్రమైన విషయమని అసలు విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, స్వాన్‌ మాత్రం వదల్లేదు. ఆధారాలున్నాయని, అంత స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోరా, అని ప్రశ్నించగా, ఏది ఉన్నా నాలుగు గోడల మధ్యే మాట్లాడుకుంటామని మరోసారి చెప్పాడు. దీన్ని బట్టే మరోసారి రుజువు ఐంది పాక్ చైనా పై ఎంతటి ప్రేమని చూపిస్తుందో.