Begin typing your search above and press return to search.

బ్రిటన్లో వీసా వచ్చిన ఆనందం 'ఆవిరి'..!

By:  Tupaki Desk   |   9 Jan 2023 6:29 AM GMT
బ్రిటన్లో వీసా వచ్చిన ఆనందం ఆవిరి..!
X
బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు కొన్నేళ్లుగా ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో విదేశాలకు వెళ్లేందుకు జంకిన వారంతా ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో అమెరికా.. బ్రిటన్ వంటి దేశాలు ఇచ్చే వీసాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ రెండు దేశాలు భారతీయ విద్యార్థులకు పోటీ మరీ వీసాలు మంజూరు చేస్తుండటం గమనార్హం.

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భణం పెరిగింది. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనగా కొన్ని దేశాలు ఇప్పటికే దివాళా తీశాయి. అయితే విదేశాల్లో పెరిగిన ద్రవ్యోల్బణ పరిస్థితులు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా యూకేలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని పలువురు భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. బ్రిటన్లో వీసా వచ్చిన ఆనందం పెరిగిన ద్రవ్యోల్భణంతో ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్రిటన్లో ఆకాశాన్ని అంటిన ధరలు భారతీయ విద్యార్థులతో పాటుగా విదేశీయులను సైతం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వసతి.. ఆహారం కోసం పెడుతున్న ఖర్చు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల నుంచి బ్రిటన్లో ఉంటున్న రియాజైన్ మాట్లాడుతూ గతంలో రెండు వారాల ఆహారానికి అయ్యే ఖర్చు ప్రస్తుతం నాలుగు రోజులకే సరిపోతుందని చెప్పారు. ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయని వెల్లడించాడు.

తాను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ నార్తాంప్టన్లో ఎంఎస్సీ చేస్తున్నట్లు రియాజైన్ తెలిపారు. బ్రిటన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీయులకు సైతం అందుబాటు ధరలో వసతి సదుపాయాలు దొరకడం లేదని వివరించారు. ఈ సందర్భంగా చాయనిక దుబే మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్లో 21 రోజులు బస చేయడానికి ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని వాపోయారు.

తాను మూడు నెలల క్రితం యూకే వచ్చానని.. ప్రస్తుతం గోల్డ్ స్మిత్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ కల్చరల్ పాలసీలో మాస్టర్స్ చేస్తున్నట్లు తెలిపారు. 2022లోనే యూకే ద్రవ్యోల్భణం రికార్డు స్థాయిలో పెరిగింది. వినియోగదారుల సూచీ 8.8 శాతానికి పెరగగా నవంబర్లో అది 9.3 శాతం నమోదైనట్లు గణంగాకలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకోవడానికి విద్యార్థులు టాప్ అప్ రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.

దీంతో విదేశాల్లో చదివే విద్యార్థులకు బ్యాంకులు రుణ పరిమితిని పెంచాయి. అయితే ఖర్చుల భారం తగ్గించుకోవాలని మాత్రం పలువురు భారతీయ విద్యార్థులు ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు దారులు వెతుకుతున్నారు. కాగా గత విద్యా సంవత్సరానికి గాను భారతీయ విద్యార్థులకు యూకే 1.27 లక్షల వీసాలను జారీ చేసింది. అయితే ఆ దేశంలో పెరిగిన ద్రవ్యోల్భణంతో మనోళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.