Begin typing your search above and press return to search.

కాపులు చెప్పేశారు... పవన్ ఏం చెబుతారో...?

By:  Tupaki Desk   |   27 Dec 2022 5:30 PM GMT
కాపులు చెప్పేశారు... పవన్ ఏం చెబుతారో...?
X
కాపులు తమ మనసులో ఏముందో అది విప్పి చెప్పేశారు. తమ ఆరాధ్య దైవాలుగా వంగవీటి మోహన రంగాతో మొదలుకుని మెగాస్టార్ చిరంజీవిని పెట్టుకుని ఇపుడు పవన్ కళ్యాణ్ తోనే తన పయనం అంటూ కాపులు కుండబద్ధలు కొట్టారు. కాపు జాతి చిరకాల కోరిక తీరేందుకు రెండు దఫాలుగా ఎంతో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి ఎక్కడో ఆటంకాలతో ఆగిపోయాయని, ఇపుడు పవన్ రూపంలో తమకు ఆశాకిరణంగా రాజకీయం కనిపిస్తోందని వారు అంటున్నారు.

వంగవీటి రంగా వేసిన బాటను అనుసరిస్తూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ద్వారా కాపులు రాజ్యాధికారం సాధించాలని విశాఖ లో జరిగిన కాపునాడు కచ్చితమైన సందేశాన్ని పంపించింది. కాపులు రెండు అవకాశాలు వదులుకున్నారు. మూడవ ఛాన్స్ అని అసలు వదుకోరు. ఈసారి కాపు ముఖ్యమంత్రి ఏపీకి రావాల్సిందే అని వారు అంతా నినదించారు.

ఏపీ జనాభాలో దాదాపుగా పద్దెనిమిది శాతం పైగా ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పదవి అందని పండుగా ఉందని, రంగా కనుక జీవించి ఉంటే ఏనాడో ముఖ్యమంత్రి అయి ఉండేవారని వారు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రజారాజ్యం టైం లో కొన్ని పొరపాట్లు జరిగాయని, దాని వల్లనే చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయామని పేర్కొంటున్నారు.

అయితే ఇపుడు గతం కంటే రెట్టించిన ఉత్సహాంలో పవన్ కళ్యాణ్ణి సీఎం గా చేసుకోవాలని కాపులు ఆరాటపడుతున్నారని వారు తేటతెల్లం చేశారు. కాపులు ఇలా పవన్ని సీఎం గానే చూడాలని ఉందని చెబుతున్నారు. ఇక ఈ సభకు హాజరైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని, మెజారిటీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం ఎపుడూ చూడలేదని, కాబట్టి కాపుల కోరికను తాము తీరుస్తామని చెబుతున్నారు.

ఇలా కాపులు తమ మనసు పరిచేశారు. పవన్ సీఎం కావాల్సిందే అని అంటున్నారు. కాపుల నుంచి వచ్చ్న ఈ డిమాండ్ ని పవన్ ఎలా చూస్తారు. దానికి తగిన కార్యాచరణను ఆయన ఎలా రూపొందించుకుంటారు అన్నదే ఇక్కడ ప్రధాన చర్చ. ఏపీలో మూడవ పార్టీకి మూడవ శక్తికి ఎంతవరకూ అవకాశాలు ఉన్నాయన్నది ఒక ప్రశ్న అయితే అవకాశాలు ఎపుడూ తమ దగ్గరకు రావు, వాటిని తామే అందిపుచ్చుకోవాలన్నది కూడా అందరూ చెప్పే విషయం.

అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాపుల కోరికను తీర్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. ఆయన పొత్తులతో వచ్చినా లేక ఒంటరిగా పోటీ చేసినా ఎలా రాజకీయం నడపినా కూడా చివరికి ముఖ్యమంత్రి పదవిని కాపులకు దక్కేలా చేస్తే మాత్రం ఆయన చరిత్రలో నిలిచిపోతారు. దశాబ్దాల కాపుల కలను నెరవేర్చిన వారు అవుతారు.

ఏపీలో 2024 ఎన్నికలు అత్యంత కీలకంగా ఉన్నాయి. అదే సమయంలో కాపులు కూడా జనసేన వైపుగా పోలరైజ్ అవుతున్నారు. కాబట్టి కాపు సమాజం ఆకాంక్షలను అర్ధం చేసుకుని జనసేన తగిన విధంగా తన రాజకీయ యాక్షన్ ప్లాన్ ని సెట్ చేసుకుంటే ఏపీలో సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు. పవన్ కి అద్భుతమైన సినీ గ్లామర్ తో పాటు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయనకు బలమైన సామాజికవర్గం అండగా ఉంది. ఇక ఆయన తన కొత్త వాహనం వారాహిని అధిరోహించి కాపులు అనుకున్న లక్ష్యానికి దాన్ని నడపడమే తరువాయి అని అంటున్నారు. మరి పవన్ ఏమి చేస్తారో ఏమి చెబుతారో చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.