Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   4 Jan 2023 10:26 AM GMT
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X
బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లింది.

ఇటీవలే సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దీనిపై అప్పీల్ కు వెళ్లాలని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీంతో కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

ఇటీవల హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కార్ కు షాకిచ్చింది. నలుగురు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసును తెలంగాణ హైకోర్టు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు అప్పగించడంతో కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బట్టబయలు చేయడంలో అత్యుత్సాహం కారణంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చిక్కులు తప్పవని ప్రముఖ బ్యూరోక్రాట్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలు, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, ఇతర పత్రాలతో సహా దర్యాప్తు అంశాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయనే కీలకమైన అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి బీ విజయసేన్ రెడ్డి తన తీర్పులో లేవనెత్తారు. ముఖ్యమంత్రికి ఎవరు ఆధారాలు ఇచ్చారనే ప్రశ్నలకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమాధానం చెప్పలేకపోయారని న్యాయమూర్తి గమనించారు. ఇక సిట్ దర్యాప్తు సరిగాలేదని..పేర్కొన్న హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి 45 కారణాలను చూపించింది.

అయితే బీజేపీ విషయంలో ఎక్కడ తగ్గకూడదని.. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని.. అందుకే అవసరమైతే హైకోర్టుకు.. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదలతో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.