Begin typing your search above and press return to search.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం .. !

By:  Tupaki Desk   |   31 Dec 2020 11:15 AM GMT
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం .. !
X
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కేరళ శాసన సభ ఏకగ్రీవంగా తిరస్కరించింది. ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తీర్మానం ద్వారా డిమాండ్ చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఇలాగే కొనసాగితే కేరళపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫుడ్ సప్లై నిలిచిపోతే రాష్ట్రం ఆకలితో అల్లాడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.

ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడంతో వివాదం ఏర్పడింది. శాసన సభను అత్యవసరంగా సమావేశపరచడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. కొద్ది రోజుల తర్వాత గవర్నర్ ప్రత్యేక సమావేశాలకు అనుమతి ఇచ్చారు. శాసన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని తెలిపారు. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టమేనని చెప్పారు. వీటిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మరింత కఠిన పదజాలంతో విమర్శించాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని విజయన్ తోసిపుచ్చారు.

కాగా,కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది అగస్టులోనే పంజాబ్ కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది.కొత్త చట్టాలతో రైతులను కార్పోరేట్ దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు వ్యవసాయ సంక్షేమ,అభివృద్ది బాధ్యతల నుంచి తప్పించుకునేలా కొత్త చట్టాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేసున్న సంగతి తెలిసిందే.