Begin typing your search above and press return to search.

దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ మూసేస్తున్నారట .. కారణం ఇదే !

By:  Tupaki Desk   |   8 Sep 2020 12:30 AM GMT
దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ మూసేస్తున్నారట .. కారణం ఇదే !
X
బెంగళూరు లో ఏర్పాటు చేసిన అతిపెద్ద కరోనా కేర్ సెంటర్ త్వరలో మూతపడబోతుంది. ఈ నెల 15వ తేది నుంచి ఈ కరోనా కేర్ సెంటర్ ను మూసివేయబోతున్నారు అధికారులు. ఈ మేరకు ఇప్పటికే ఓ సర్కులర్‌ను జారీ చేశారు. ఎందుకు మూసివేస్తున్నారనడానికి సరైన కారణాలను అధికారులు వెల్లడించట్లేదు. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పడకలకు అనుగుణంగా పేషెంట్ల సంఖ్య లేకపోవడం ఓ కారణమని వినిపిస్తుంది. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోన్న బెంగళూరులో పేషెంట్ల కొరత కారణం కాదు అని కొందరు చెప్తున్నారు. ఇకపోతే, బెంగళూరులో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు లక్షన్నరకు చేరుకున్నాయి. బీబీఎంపీ అధికారులు ఆదివారం నాడు విడుదల చేసిన వివరాల ప్రకారం.. 1,47,581 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అందులో 1,05,692 మంది కోలుకున్నారు. 2164 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 2824 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 38 మంది మృత్యువాత పడ్డారు.

ప్రతిరోజూ కూడా ఒక్క బెంగళూరు పరిధిలోనే 2000 నుంచి 3000 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో అతి పెద్ద కరోనా కేర్ సెంటర్‌ ను మూసివేయబోతుండటం తీవ్ర చర్చకి దారిస్తుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయడానికి కర్ణాటక ప్రభుత్వం.. బెంగళూరులోని అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్‌ లో ఈ కరోనా కేర్ యూనిట్‌ ను ఏర్పాటు చేసింది. 10 వేల పడకలతో దీన్ని ఏర్పాటు చేసింది. బాగల్ ‌కోటెలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మైనారిటీ హాస్టళ్లు, జీకేవీకే నుండి ఫర్నిచర్‌ ను తెప్పించింది.

ఒకేసారి 10 వేల మంది కరోనా పేషెంట్లు ఇందులో చికిత్స తీసుకునేలా ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతను బీబీఎంపీకి అప్పగించింది. అయితే , తాజాగాఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను మూసివేయాలని నిర్ణయించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఉద్దేశపూరకంగా దీన్ని క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్, జనతాదళ్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. దాన్ని మూసేస్తూ .. కరోనా బాధితులకి సరైన వైద్య సదుపాయాలను కల్పించకుండా ప్రభుత్వం కరోనా పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడుతున్నారు.