Begin typing your search above and press return to search.

ఇంట్లో కూర్చోబెట్టి సగం జీతం.. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం!

By:  Tupaki Desk   |   24 July 2021 12:30 AM GMT
ఇంట్లో కూర్చోబెట్టి సగం జీతం.. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం!
X
మ‌న‌దేశంపై క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో దాడిచేసిందో అందరికీ తెలిసిందే. ప్ర‌పంచంలో మ‌రే దేశంపైనా ఈ స్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేదు. అయితే.. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన‌వారితోపాటు ప‌డ‌నివారు కూడా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. ఎన్నో క‌ష్టాలు.. మ‌రెన్నో న‌ష్టాలు అనుభ‌వించారు. ఆసుప‌త్రిలో ట్రీట్మెంట్ పేరుతో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఉన్న‌దంతా ఊడ్చి పెట్టారు. అప్పుల‌పాల‌య్యారు. ఒక స‌ర్వే ప్ర‌కారం.. దేశంలోని ప్ర‌జ‌లు క‌రోనా మీద చేసిన ఖ‌ర్చు ఎంతో తెలుసా? ఏకంగా.. 64,000 కోట్ల రూపాయ‌లు!

ఇది.. సాధార‌ణ జ‌నాలు కోల్పోయిన ఆదాయం. మ‌రి, ప్ర‌భుత్వాలు కోల్పోయిన ఆదాయం ఎంత‌? అన్న‌ప్పుడు అది ఊహ‌కు అంద‌కుండా ఉంది. వ‌రుస లాక్ డౌన్ విధించ‌డంతో.. ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆ త‌ర్వాత ఆంక్ష‌ల మ‌ధ్య కార్య‌క‌లాపాలు కొన‌సాగిన‌ప్ప‌టికీ.. స‌ర్కారుకు స‌మ‌కూరిన ఆదాయం అంతంతే. దీంతో.. రాష్ట్రాలు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నీఇన్నీ కావు. దేశంలోని చాలా రాష్ట్రాల ప‌రిస్థితి ఇలాగే ఉంది. అలాంటి వాటిల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.

క‌రోనా వ‌ల్ల ఎక్కువ కాలం లాక్ డౌన్ కొన‌సాగిన రాష్ట్రాల్లో మధ్య‌ప్ర‌దేశ్ కూడా ఉంది. ఆ రాష్ట్రానికి ఇప్ప‌టికే 2.53 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పులు ఉన్నాయి. ఇక స‌ర్కారుకు రావాల్సిన ఆదాయంలో దాదాపు 30 శాతానికి పైగా కోత‌ప‌డింది. దీంతో.. ఈ ప‌రిస్థితిని ఎలా అధిగ‌మించాలో ప్ర‌భుత్వానికి తెలియ‌ట్లేదు. నిత్యావ‌స‌రాల‌కు సైతం ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. దీంతో.. అందుబాటులో ఉన్న స‌ర్కారు ఆస్తుల‌ను సైతం అమ్ముతోంది. వాటి ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 500 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే స‌మ‌కూరాయి. ఈ మొత్తం ఏ మూల‌కూ స‌రిపోని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో విదేశీ ఫార్ములాను అమ‌లు చేయాల‌నే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం!

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలుగా చెల్లించే డ‌బ్బును మిగిలించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇందుకోసం ఒక స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఈ త‌ర‌హా ఆలోచ‌న చేయ‌లేదు. ఆ మాట‌కొస్తే కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ నిర్ణ‌యం తీసుకోలేదు. అదేమంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఏళ్ల‌త‌ర‌బ‌డి సెల‌వులు ఇవ్వ‌డం! అంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఇంటి ద‌గ్గ‌రే ఉండ‌మంటారు. అయితే.. నెల‌లో స‌గం వేత‌నం మాత్రం ఇస్తారు. మిగిలిన స‌గం జీతం ప్ర‌భుత్వానికి మిగులుతుంద‌న్న‌మాట‌.

ఇలా సెల‌వులు తీసుకున్న వారు ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ వేరే ప‌ని ఏదైనా చేసుకోవొచ్చు. వ్యాపార‌మైనా, మ‌రేదైనా ప‌నా? అనేది వారి ఇష్టం. ఇలా ప‌నిచేసుకునే వారికి మూడు నుంచి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు సెల‌వులు ఇచ్చేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ఈ సెల‌వుల గ‌డువు తీరిన త‌ర్వాత ఉద్యోగానికి రావాలా? లేదా? అనేది వారి ఇష్టం. అంటే.. ఆ త‌ర్వాత ఉద్యోగం చేరాల‌నుకుంటే చేరొచ్చు. ఈ స‌రికొత్త విధానాన్ని ప‌రిశీలించ‌డం.. నిబంధ‌న‌లు పూర్తిచేయ‌డం అంతా జ‌రిగిపోయింది. ముఖ్య‌మంత్రి సంతకం చేస్తే.. అమ‌ల్లోకి రావ‌డ‌మే త‌రువాయిగా ఉంది.

అయితే.. ఈ ప‌థ‌కం మ‌న‌కు కొత్తేగానీ.. విదేశాల్లో కాదు. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఈ విధానాన్ని అమ‌లు చేసి ఉన్నారు. ఆర్థిక మాంద్యం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేస్తుంటారు. మ‌న దేశంలో ఇది అమ‌లైతే.. ఇలాంటి విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మొద‌టి రాష్ట్రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ నిలుస్తుంది. ఈ విధానం ద్వారా ఏడాదికి 6,500 కోట్లను మిగుల్చుకోవాల‌న్నది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. అయితే.. ఇందులో నుంచి విద్య‌, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాల‌ను మిన‌హాయించారు. ఇవి కాకుండా.. మిగిలిన ప్ర‌భుత్వ శాఖ‌ల్లోని ఉద్యోగుల‌కు ఈ స‌దుపాయం క‌ల్పించనున్నారు.