Begin typing your search above and press return to search.

కాకినాడలో మతం పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం

By:  Tupaki Desk   |   20 Sept 2020 12:30 PM IST
కాకినాడలో మతం పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం
X
మోసం చేయాలనుకున్నోడు ఏమైనా చేస్తాడు. ఎలాంటి మాటలైనా చెబుతాడు. తాజాగా కాకినాడలో తెరపైకి వచ్చిన భారీ మోసం గురించి వింటే షాక్ తినాల్సిందే. మతం పేరుతో మాయమాటలు చెప్పేసి.. భారీగా దోచేసిన నిజం బయటకు రావటం కలకలంగా మారింది. మల్టీ లెవల్ మోసాలు కొత్త కాకున్నా.. మతం పేరుతో ఎర వేసి.. ఎంతోమంది అమాయకుల్ని దోచేసిన ఈ నయా దోపిడీలోకి వెళితే..

ఏపీలోని కాకినాడ కేంద్రంగా ఒక ముఠా కోట్లాది రూపాయిల్ని దొంగమాటల్ని చెప్పి దోచేసింది. క్రైస్తవ సమాజం ప్రస్తుతం చాలా సంక్షోభంలో ఉందని.. దీన్ని అధిగమించాలంటే ప్రత్యేక కౌన్సెల్ ఏర్పాటు చేయాలన్న మాటతో పాటు.. భారత సర్కార్ క్రైస్తవ సంఘాలకు వచ్చే నిధుల్ని అడ్డుకుంటుందన్న ఆరోపణతో పాటు.. దేవుడి ఆదేశాలతో తాము రంగంలోకి దిగినట్లుగా కలరింగ్ ఇచ్చేస్తారు.

జస్ట్ రూ.37,500 కడితే కోటి రూపాయిలు లభిస్తాయని చెప్పటమే కాదు.. రాష్ట్రపతి భవన్ ను బ్రిటీష్ ఇండియాలో క్రైస్తవలే కట్టించినట్లుగా మాటలు చెప్పటమే కాదు.. త్వరలోనే అది మన సొంతమవుతుందంటూ చెప్పేయటం గమనార్హం. క్రైస్తవుల్ని మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న సదరు వ్యక్తి తాజాగా కరోనాతో కాకినాడలో మరణించటంతో ఈ వ్యవహారం రచ్చగా మారింది.

ఎందుకంటే భారీగా వసూలు చేసిన వ్యక్తి కాకినాడకు చెందినవాడు కావటం.. కోవిడ్ తో మరణించటంతో తాము కట్టిన డబ్బుల మాటేమిటన్న ఆందోళనతో విషయం బయటకు పొక్కింది. దీని గురించి విన్నవారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. మతం పేరు చెప్పటం ద్వారా.. పలువురు పాస్టర్లను.. క్రైస్తవ నేతల్ని ఉచ్చులో పడేసినట్లుగా తెలుస్తోంది. ఇతడి మాటల్ని నమ్మి.. భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పాస్టర్లు.. క్రైస్తవ సంఘాల పెద్దలు డబ్బులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఈ స్కాం సూత్రధారి కరోనాతో తాజాగా మరణించటంతో.. నమ్మి డబ్బులు పెట్టినోళ్లంతా ఇప్పుడు గొల్లుమంటున్నారు.