Begin typing your search above and press return to search.

తప్పు చేసే భర్తలకు చెక్ చెప్పే చట్టం.. ఎన్ఆర్ఐ భార్యలకు ఉండదా?

By:  Tupaki Desk   |   4 Feb 2022 3:18 AM GMT
తప్పు చేసే భర్తలకు చెక్ చెప్పే చట్టం.. ఎన్ఆర్ఐ భార్యలకు ఉండదా?
X
తప్పు ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే.. చట్టం ఎవరికైనా ఒకటే. అది మగ.. ఆడ అన్న తేడానే కాదు.. ధనిక.. పేద.. రాజు.. బంటు ఎవరి విషయంలో అయినా ఒకటేలా వ్యవహరించాలి. కానీ.. తాజాగా వెలుగు చూస్తున్న ఉదంతాలు చూస్తే.. పురుషులకు చెక్ చెప్పే చట్టాలు.. మహిళల మాటేమిటి? అన్న ప్రశ్నను సంధిస్తున్నాయి. ఎన్ఆర్ఐ భర్తలు చేసే తప్పులకు శిక్షించే చట్టాలు ఉన్నప్పుడు.. ఎన్ఆర్ఐ మహిళలు చేసే తప్పులకు చెక్ చెప్పేలా చట్టాలు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు పంజాబ్ ఎంపీ జస్బీర్ గిల్.

తాను ప్రస్తావిస్తున్న అంశంపై లోక్ సభలో చర్చ జరగాలని ఆయన నోటీసు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. విదేశాలకు వెళ్లిన కొందరు యువతలు.. తమ అవసరం అయ్యాక భర్తల్ని వదిలేస్తున్నారని.. వారి పనితో అవమానానికి గురైన యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయని చెప్పిన ఆయన.. ఎన్ఆర్ఐ మహిళల తీరుతో పురుషుల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.

తమ భార్యలు అమెరికాలో సెటిల్ అయ్యేందుకు భర్తలు ముందుగా ఎంతో ఖర్చు చేస్తున్నారని.. వారి చదువుకు అయ్యే ఖర్చును అబ్బాయిల తల్లిదండ్రులే భరిస్తున్నారని చెబుతున్నారు. కానీ.. చదువులు పూర్తి చేసుకొని.. అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత.. కొందరు యువతులు భర్తల్ని వదిలేస్తూ.. విడిగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

ఇలాంటి హ్యాండిచ్చే భార్యల్ని శిక్షించే చట్టాలు లేవని.. అలాంటి వారి విషయంలో చట్టం కఠినంగా వ్యవహరించేలా ఉండాలన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ వాదనకు మిగిలిన ఎంపీలు ఏరీతిలో రియాక్టు అవుతారో చూడాలి