Begin typing your search above and press return to search.

ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా.. భార‌త్ స్థానం ఇదే!

By:  Tupaki Desk   |   21 July 2022 4:35 AM GMT
ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా.. భార‌త్ స్థానం ఇదే!
X
ప్రపంచంలో శ‌క్తివంత‌మైన పాస్‌పోర్టుల జాబితాలో భార‌త్ 87వ స్థానంలో నిలిచింది. హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌ అనే ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ 2022కు సంబంధించి ఈ ర్యాంకులు విడుదల చేసింది. ఈ సంస్థ గతేడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 90వ స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి దానిని మెరుగుపర్చుకుని 87వ స్థానంలో నిల‌వడం విశేషం.

కాగా ప్ర‌పంచంలో సుమారు 202 దేశాలుంటే భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలు వీసా లేకుండానే సుస్వాగతం పలుకుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల్లో భారత్‌ పాస్‌పోర్టుకు 87వ ర్యాంకు దక్కింది.

కాగా, ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వరుసగా ఐదోసారి జ‌పాన్ ఫ‌స్ట్ ర్యాంకు సాధించ‌డం విశేషం. జపాన్‌ పాస్‌పోర్టు ఉన్నవారు ఏకంగా 193 దేశాలకు సులువుగా వెళ్లవచ్చు. ఇక, సింగపూర్‌. దక్షిణ కొరియా పాస్‌పోర్టులు ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ రెండు దేశాల పౌరులు 192 దేశాలకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు.

జర్మనీ, స్పెయిన్‌ పాస్‌పోర్టులు ఉమ్మడిగా మూడో ర్యాంకు సాధించాయి. జ‌ర్మ‌నీ, స్పెయిన్ పాస్‌పోర్టులు ఉన్న‌వారు 190 దేశాల్లోకి సులువుగా వెళ్ల‌వ‌చ్చు. ఫిన్లాండ్, ఇట‌లీ, ల‌గ్గెంబ‌ర్గ్ ఉమ్మ‌డిగా నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ రెండు దేశాల పాస్‌పోర్టులు ఉన్న‌వారు 189 దేశాల‌కు సులువుగా వెళ్ల‌వ‌చ్చు. ఇక ఐదో స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్ నిలిచాయి. ఈ రెండు దేశాల పాస్‌పోర్టులు ఉన్న‌వారు 188 దేశాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.

ఇక‌ యునైటెడ్‌ కింగ్‌డమ్ (యూకే), అమెరికా పాస్‌పోర్టులు వరుసగా ఆరు, ఏడు ర్యాంకులు సాధించాయి. యూకే పాస్‌పోర్టుతో 187 దేశాల‌కు, యూఎస్ పాస్‌పోర్టుతో 186 దేశాల‌కు వెళ్లొచ్చు. యూఏఈ (యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్) పాస్‌పోర్టు 15వ స్థానంలో ఉంది.

చైనా పాస్‌పోర్టు 69వ స్థానంలో నిలిచింది. చైనా పాస్‌పోర్టుతో 80 దేశాలకు సులువుగా వెళ్లొచ్చు. అదేవిధంగా రష్యా పాస్‌పోర్టుకు 50వ ర్యాంకు దక్కింది. ఆప్ఘ‌నిస్తాన్ పాస్ పోర్టు చివ‌రి స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టుతో 27 దేశాల‌కు మాత్రమే వెళ్లే అవ‌కాశం ఉంది.