Begin typing your search above and press return to search.

ఆ చైనా నౌకతో భార‌త్‌కు క‌లిగే న‌ష్టం ఇదేనా?

By:  Tupaki Desk   |   17 Aug 2022 3:55 AM GMT
ఆ చైనా నౌకతో భార‌త్‌కు క‌లిగే న‌ష్టం ఇదేనా?
X
భార‌త్ అభ్యంత‌రాలు, ఆందోళ‌న‌లను బేఖాత‌రు చేస్తూ చైనా త‌న హైటెక్ నిఘా నౌక.. యువాన్ వాంగ్ 5ని శ్రీలంక‌లోని హంబ‌న్‌టొట నౌకాశ్ర‌యంలోకి ప్ర‌వేశించింది. ఇంధ‌నం నింపుకోవ‌డానికే తాము హంబన్‌టొట‌లో ప్ర‌వేశించామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ అసలు కార‌ణాలు వేర‌ని నిపుణులు అంటున్నారు. ఈ హైటెక్ నిఘా నౌక ప‌రిధిలోకి ద‌క్షిణ భార‌త‌దేశం మొత్తం వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఒడిశాలోని చాందీపూర్ క్షిప‌ణి ప‌రీక్ష కేంద్రం, శ్రీహ‌రికోట‌లోని రాకెట్ ప్ర‌యోగ కేంద్రం.. షార్‌తోపాటు క‌ల్ప‌కం, కుడంకుళంల‌లో అణు విద్యుత్ ప్లాంట్‌తోపాటు ద‌క్షిణ భార‌త‌దేశంలోని విమానాశ్ర‌యాలు, నౌకాశ్ర‌యాల‌న్నిటిపైనా ఈ నౌక నిఘా వేయ‌నుంద‌ని చెబుతున్నారు. అంతేకాకుండా దేశ ర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల‌పైనా చైనా నౌక నిఘా వేస్తోంద‌ని పేర్కొంటున్నారు.

ఈ నౌక ఆగ‌స్టు 11నే శ్రీలంక‌లోకి ప్ర‌వేశిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడే భార‌త్ త‌న అభ్యంత‌రాల‌ను శ్రీలంక‌కు గ‌ట్టిగా తెలిపింది. దీంతో శ్రీలంక కూడా చైనా నౌక ప్ర‌యాణాన్ని మ‌ళ్లించాల్సిందిగా కోరింది. అయితే చైనా నుంచి వ‌చ్చిన ఒత్తిళ్ల‌లో శ్రీలంక మ‌న‌సు మార్చుకుంది. చైనా నిఘా నౌక త‌మ రేవు ప‌ట్ట‌ణం హంబ‌న్‌టొట‌లో లంగ‌రు వేసుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చింది.

మరోవైపు భారత్‌ ఆందోళనల్ని చైనా ఖండిస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్ చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తాము వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని తేల్చిచెబుతున్నారు.

యువాన్‌ వాంగ్‌ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెబుతున్న‌ప్ప‌టికీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలద‌ని నిపుణులు చెబుతున్నారు. భారత్ సైన్యానికి సంబంధించిన‌ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంద‌ని అంటున్నారు. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్‌ చేసే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ ఈ నౌకలో ఉంద‌ని తెలుస్తోంది. 1076 కి.మీ దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్‌ పరిధిలోకి వస్తాయి. ఈ లెక్క‌న ద‌క్షిణ భార‌త‌దేశ‌మంతా ఈ నౌక నిఘా ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని స‌మాచారం.

అయితే జూలై 14న చైనా నుంచి బయలుదేరిన‌ ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సముద్ర గర్భంలో జలాంతర్గాముల ర‌హ‌స్యాల‌ను కూడా తెలుసుకునే సామ‌ర్థ్యం ఉంద‌ని చెబుతున్నారు.

హంబ‌న్‌టొట‌లో చైనా నౌక ఉన్నంతవరకు దానికి ఎలాంటి పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేష‌న్‌ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని వివ‌రిస్తోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉండడం గ‌మ‌నార్హం.