Begin typing your search above and press return to search.

రూ.5 లక్షలున్న బ్యాగును రోడ్డుపై పడేసిన వ్యక్తి .. ఎందుకు , ఏం జరిగిందంటే

By:  Tupaki Desk   |   10 April 2021 8:03 AM GMT
రూ.5 లక్షలున్న బ్యాగును రోడ్డుపై పడేసిన వ్యక్తి .. ఎందుకు , ఏం జరిగిందంటే
X
రాత్రి దాదాపుగా పది గంటల సమయంలో ఓ వ్యక్తి బాగా రద్దీగా ఉన్న ప్రదేశం లో ఐదు లక్షల డబ్బు ఉన్న ఓ బ్యాగ్ ను విసిరేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోసాగాడు. అతడి వెంట కొందరు వ్యక్తులు పరుగులు తీశారు. పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు ఛేజ్ చేశారు. దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత అతడిని చివరికి పట్టుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తి ఏ దొంగో అనుకునేరు ,అతడు ఓ ఐటీ అధికారి. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులు సీబీఐ ఆఫీసర్లు. ఆదాయపు పన్ను ఎగవేతకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుు యత్నించి చివరకు ఇలా అడ్డంగా బుక్కయ్యాడు. అతడితో పాటు మరో ఇద్దరు ఐటీ అధికారులను కూడా అరెస్టు చేశారు.

ఈ ఘటన ముంబైలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. ముంబైకి చెందిన ఆశీష్ కుమార్ అనే ఐటీ ఇన్ స్పెక్టర్ లంచం డిమాండ్ చేశాడన్న వార్త సీబీఐ అధికారుల వద్దకు చేరింది. ఆదాయపు పన్ను ఎగవేతకు యత్నించిన ఓ వ్యక్తిని తప్పించేందుకు ఐదు లక్షల రూపాయలను అశీష్ డిమాండ్ చేశాడు. మొదటగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినా, చివరకు బేరం కాస్తా ఐదు లక్షల రూపాయల కి కుదిరింది. వాళ్లతో బేరం కుదుర్చుకున్న వ్యక్తే, నేరుగా సీబీఐ అధికారుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో సీబీఐ అధికారులు వల పన్నారు. అతడికి రూ.5 లక్షల రూపాయలు ఉన్న బ్యాగును ఇచ్చారు. తమ ప్లాన్ ను చెప్పారు.దీంతో అతడు ఆశీష్ కు ఫోన్ చేసి ఎక్కడ డబ్బులు తీసుకోవాలో, ఎన్నింటికి రావాలో చెప్పాడు. అనుకున్నట్టుగానే ముంబైలోని గోరెగావ్ తూర్పు ప్రాంతంలోని దిందోషీ ఫైర్ స్టేషన్ వద్దకు గురువారం రాత్రి పది గంటలకు ఆశీష్ వచ్చేశాడు. అయితే అప్పటికే అక్కడ సీబీఐ అధికారులు మాటువేసి ఉన్నారు. అక్కడకు చేరుకున్న ఆశీష్ కు ఆ వ్యక్తి ఐదు లక్షల రూపాయలు ఉన్న బ్యాగును ఇచ్చాడు. వెంటనే సీబీఐ అధికారులు చుట్టుముట్టడంతో ఆ బ్యాగును రోడ్డుపైనే పారేసి పరారయ్యాడు. కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత ఆశీష్ ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు మరో ఇద్దరు ఐటీ ఆఫీసర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.