Begin typing your search above and press return to search.

భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం ... ఏం జరగబోతుందంటే !

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:35 PM GMT
భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం ... ఏం జరగబోతుందంటే !
X
సాధారణంగా గ్రహశకలాలు భూమివైపు వస్తుంటాయి. వాటివల్ల మనకు అన్నిసార్లూ ప్రమాదం ఉండకపోవచ్చు. తాజాగా ఓ భారీ సైజు ఉన్న ఓ ఆస్టరాయిడ్ భూమి వైపు దూసుకువస్తోందని స్పేస్ సైంటిస్టులు చెబుతున్నారు. భారీ అస్టరాయిడ్ మరికొన్ని గంటల్లో భూకక్ష్యలోకి ప్రవేశించబోతోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంస్థ నాసా అధ్యయనం చేస్తోంది. రేపు మధ్యాహ్నం అస్టరాయిడ్ భూకక్ష్యలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసాలోని సెంటర్ ఫర్ నియర్, ఎర్త్ ఆబ్జెక్ట్స్ దీన్ని గుర్తించింది. 2020 RK 2 అనే పేరున్న ఈ గ్రహశకలం మార్గాన్ని కొన్ని వారాలుగా ట్రాక్ చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఈ గ్రహశకలం వ్యాసం 36 నుంచి 81 మీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. దీని వెడల్పు 118-256 అడుగుల మధ్య ఉంటుంది. ఇది బోయింగ్ 747 జెట్ కంటే పెద్ద సైజులో ఉండటం విశేషం. అక్టోబర్ 7న భూమి అవుటర్ ఆర్బిట్ లోకి ఈ గ్రహశకలం రావచ్చని నాసా ప్రకటించింది. గత నెలలో మొదటిసారిగా దీన్ని గుర్తించారు. ఇది అపోలో గ్రహశకలం విభాగానికి చెందిన ఆస్టరాయిడ్. 2020 RK2 గ్రహశకలం సెకనుకు 6.68 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకుపోతోందని నాసా తెలిపింది. అంతే వేగంతో భూ కక్ష్యలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంతరిక్షంలో ఈ వేగం ఏమంత ఎక్కువ కాదని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం అక్టోబర్ 7... సాయంత్రం 6.12గంటలకు, బ్రిటిష్ సమ్మర్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 1.12 గంటలకు ఇది భూమి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గ్రహశకలం 38,27,797.34 కిలోమీటర్ల దూరంలో భూమిని దాటుతుంది. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు చాలా అరుదు అని నాసా తెలిపింది.భూ కక్ష్యకు దగ్గరగా వచ్చినప్పటికీ, భూమి నుంచి దీన్ని చూసే అవకాశాలు లేవని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి సంవత్సరం కొన్ని డజన్ల కొద్దీ గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తాయి. వాటిలో ఎక్కువ భాగం 2020 RK2కన్నా చాలా చిన్న సైజులో ఉంటాయి. ఇలాంటి గ్రహశకలాలు భూమి కక్ష్యను చాలా అరుదుగా తాకుతాయి అని తెలిపారు.