Begin typing your search above and press return to search.

కేటీఆర్ సీఎం ఎప్పుడవుతారో చెప్పిన మేయర్

By:  Tupaki Desk   |   2 Feb 2021 11:35 AM GMT
కేటీఆర్ సీఎం ఎప్పుడవుతారో చెప్పిన మేయర్
X
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు అంటూ వస్తున్న ఊహాగానాలు ఆగడం లేదు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆ భజన ఆపడం లేదు. క్రమక్రమంగా పార్టీలో ‘కేటీఆర్ సీఎం’ అన్న డిమాండ్ కు ఆదరణ పెరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావును ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమంగా పెరుగుతోంది.

మంగళవారం కొద్దిరోజుల్లో దిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ మరోసారి కేటీఆర్ నామస్మరణ చేశారు. కేటీఆర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొందరగా చేయాలని ఆయన ఆకాంక్షించారు. “కేటీఆర్ ఖచ్చితంగా సరైన సమయంలో.. తగిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు. పార్టీ ఎమ్మెల్యేలందరి సహకారంతో మాత్రమే ఆయన సింహాసనాన్ని అధిష్టించనున్నారు ”అని రామ్మోహన్ అన్నారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి కుర్చీని అధిష్టించడానికి కేటీఆర్‌కు అవసరమైన నైతిక బలం, ఆశీర్వాదం ఇవ్వమని తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని మేయర్ చెప్పారు. "రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుకు సమయం ఆసన్నమైందని, సమయం వచ్చినప్పుడు కేటీఆర్ తెలంగాణ సీఎం అవుతారని నా బలమైన భావన" అని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

సీఎం కె. చంద్రశేఖర్ రావు తరువాత కేటిఆర్ పార్టీలో రెండోస్థానంలో ఉంటారని రామ్మోహన్ అన్నారు."కేటీఆర్ సీఎం అన్నది పార్టీలో ఏకగ్రీవ అభిప్రాయం కానుంది. తెలంగాణను గోల్డెన్ తెలంగాణగా మార్చడానికి కేటీఆర్ కు తగినంత బలం ఇవ్వమని నేను దేవుడిని ప్రార్థించాను" అని ఆయన చెప్పారు.