Begin typing your search above and press return to search.

కేటీఆర్ తో భేటీ.. అజార్ కు కొత్త పదవి వచ్చేసింది

By:  Tupaki Desk   |   28 Sep 2019 6:10 AM GMT
కేటీఆర్ తో భేటీ.. అజార్ కు కొత్త పదవి వచ్చేసింది
X
అంచనాలు తప్పలేదు. అంతా అనుకున్నట్లే జరిగింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు.. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకోవటం కొత్తేం కాదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కు జరిగిన ఎన్నికలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ తో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎప్పుడైతే భేటీ అయ్యారో.. అప్పుడే ఆయన ప్యానల్ గెలుపు ఖాయమైంది.

తాజాగా వెల్లడైన ఫలితాల్లో అజార్ ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. ఆయనకు పోటీగా బరిలోకి దిగిన ప్రముఖ రాజకీయ నాయకుడు వివేక్ బలపర్చిన ప్యానల్ ఓటమిపాలైంది. అజార్ ప్యానల్ ఆరుస్థానాల్ని గెలుచుకోవటంతో పాటు.. 74 ఓట్ల మెజార్టీతో హెచ్ సీఏ అధ్యక్షుడిగా విజయం సాధించారు. హెచ్ సీఏలో మొత్తం 227 ఓట్లు ఉండగా.. 223 ఓట్లు పోలయ్యాయి. ఇందులో అజారుద్దీన్ కు 147 ఓట్లు రాగా.. వివేక్ మద్దతుతో రంగంలోకి దిగిన ప్రకాశ్ జైన్ కు 73 ఓట్లు వచ్చాయి. దిలీప్ కు 3 ఓట్లు పడ్డాయి.

ఓపక్క ఈ ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు అజరుద్దీన్ టీఆర్ఎస్ లో చేరనున్నారన్న వార్త వ్యాపించింది. సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఖండిస్తారు. కానీ.. అజారుద్దీన్ మాత్రం ఖండించలేదు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సాగుతున్నారు. తాజా పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ లోకి చేరటం ఖాయమని చెబుతున్నారు.

తాను విజయం సాధించిన వెంటనే మంత్రి కేటీఆర్ కు అజారుద్దీన్ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే.. అజార్ గెలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపితే.. వీహెచ్ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకోవటం ఆసక్తికరంగా మారింది. త్వరలో పార్టీ మారటం ఖాయమని బలంగా ప్రచారం జరుగుతున్న వేళ.. హెచ్ సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవటం ఆసక్తికరంగా మారింది. త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే వేళ.. వీరంతా ఎలా రియాక్ట్ అవుతారో?