Begin typing your search above and press return to search.

మొన్న పంచాయతీలో.. నిన్న మున్సిపాలిటీలో ఓటేసిన ఆ ఎమ్మెల్సీ .. ఏంటయ్యా ఇది?

By:  Tupaki Desk   |   11 March 2021 12:00 PM GMT
మొన్న పంచాయతీలో.. నిన్న మున్సిపాలిటీలో ఓటేసిన ఆ ఎమ్మెల్సీ .. ఏంటయ్యా ఇది?
X
సాధరణంగా భారతదేశంలో ఏ పౌరుడికైనా ఒకే దగ్గర ఓటు ఉంటుంది. అలా కాదు అని రెండు చోట్ల ఓటు ఉంటే , అందులో ఎదో ఒకటి దొంగ ఓటే అని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇలా రెండు చోట్ల ఓట్లు ఉండేవారు చాలా తక్కువమంది ఉంటారు. అయితే , మన రాజ్యాంగం ప్రకారం ఓట్లు రెండు చోట్ల ఉన్నప్పటికీ , ఓటు హక్కుని మాత్రం ఒకే చోట ఉపయోగించుకోవాలి. కొందరు రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే , రెండు చోట్ల ఆ ఓటు హక్కుని వాడుకుంటుంటారు. అయితే , ఇలా రెండు చోట్ల ఓట్లు వేసే ఓటర్లకు బుద్ది చెప్పి , ఓటు విలువ తెలిపాల్సిన ఓ ప్రజా ప్రతినిధే ఏకంగా నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల ఓటు వేయడం విమర్శలకి తావు ఇస్తుంది. ఇంతకీ నెల రోజుల్లో రెండు చోట్ల ఓటు వేసిన ఆ ప్రజా ప్రతినిధి ఎవరు .. ఎక్కడ ఓటు వేశారు అనే విషయాన్న చూస్తే ..

వివరాల్లోకి వెళ్తే .. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లెలో ఓటు వేశారు. ఆ రోజు సగర్వంగా ఓటు వేసినట్లు వేలి సిరా గుర్తు కూడా చూపారు. బుధవారం నిర్వహించిన అనంత నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. ఇంతకీ ఆయనెవరు అంటే ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి. ఏకంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి రెండు చోట్ల ఓటు వేయటం పై విస్మయం వ్యక్తమవుతోంది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆయన రెండు చోట్ల ఓటు వేయడాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గతనెల 13వ తేదీన రాప్తాడు మండలంలోని ఎల్ ‌ఆర్‌జీ స్కూల్ ‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో అయన ఓటు వేశారు. ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చి, ఫొటోకి పోజు కూడా ఇచ్చారు. బుధవారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో అనంత నగరంలోనూ ఓటు వేశారు. 26వ డివిజన్‌లోని 26/5 పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా నెల వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటు వేయటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ విమర్శలకి ఈ ఎమ్మెల్సీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు.