Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. అద్దె ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Jun 2022 2:30 AM GMT
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. అద్దె ఎంతో తెలుసా?
X
రాజులు.. రాణులు.. రాజకుటుంబం అనగానే ప్రతి ఒక్కరి మనసులో మెదిలేది బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ. ఈ కుటుంబీకులు ఏం చేసినా అది వార్తల్లో నిలుస్తుంది. ప్రపంచం కూడా వీరికి సంబంధించిన విషయాల పట్ల కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ కుటుంబానికి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వాటి గురించి తెలిస్తే మీరు నోరు వెళ్లబెట్టడం ఖాయమండోయ్.. ఇంతకీ అదేంటో చూడండి మరి..

ప్రపంచంలో ఎన్ని అబ్బురపరిచే కట్టడాలున్నా.. ఎంత ఖరీదైన.. బ్రహ్మాండమైన భవనాలున్నా.. బ్రిటీష్ రాజ కుటుంబానికి చెందిన బకింగ్ హామ్ ప్యాలెస్‌కు ఉండే క్రేజే వేరు. ఈ భవనం ముందు ఎంతటి కట్టడాలైనా చిన్నబోవాల్సిందే. చూడ్డానికే కాదు.. విలువలోనూ ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన భవనం. బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను కొనుగోలు చేయడం.. అద్దెకు తీసుకోవడం వంటి అంశాలపై ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

ఈ భవనం ఇటు అమ్మకానికీ.. అటు అద్దెకూ అందుబాటులో లేదని.. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన భవనంగా ఈ భవనం విక్రయం జరుగుందని మెక్‌కార్తీ స్టోన్ సర్వే వెల్లడించింది. మరోవైపు అద్దె తీసుకున్నా.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన అద్దె భవనం గా కీర్తి గడిస్తుందని తెలిపింది. ఈ భవనంలో మొత్తం 775 గదులున్నాయి.

ఇందులో 19 స్టేటురూమ్‌లు, 52 రాయల్, గెస్ట్‌రూమ్‌లున్నాయి. గృహ సిబ్బంది కోసం 92 కార్యాలయాలు, 78 స్నానపు గదులు, 188 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. చర్చి, పోస్టాఫీసు, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, సిబ్బంది ఫలహారశాల, వైద్యుని కార్యాలయం, సినిమా థియేటర్ వంటి కొన్ని సౌకర్యాలున్నాయి.

ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేయాలంటే అక్షరాల £1.3 బిలియన్లు(రూ.130 కోట్లు) ఖర్చవుతాయని చెప్పింది. కరోనా మహమ్మారి ముందుతో పోలిస్తే దీని విలువ 100 మిలియన్ పౌండ్లు పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. ప్రాపర్టీ డెవలప్ అంచనాల ప్రకారం బ్రిటన్ రాజ కుటుంబాల ఆస్తి మొత్తం విలువ 2022లో £3.7 బిలియన్లకు చేరుకుంటుందని ఆ సర్వే తెలిపింది. 2019 నుంచి 46 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తెలిపింది. బ్రిటన్ రాయల్ ఎస్టేట్‌లలో ప్యాలెస్‌లు, లాడ్జీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను అద్దెకు తీసుకోవాలనుకుంటే, దాని అద్దె నెలకు 2.6 మిలియన్ పౌండ్లు( సుమారు రూ. 27 కోట్లు)గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అధ్యయనం కోసం సమీక్షించిన ఆస్తులు ఏవీ అమ్మకానికి లేదా అద్దెకు అందుబాటులో లేవు. రాచరికపు ఆస్తి హౌస్ ఆఫ్ విండ్సర్ వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది యూకే ఆస్తి, ఇది ట్రస్ట్ కింద నడుస్తుంది. బ్రిటన్‌లో క్వీన్స్ ప్లాటినం జూబ్లీని జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ అధ్యయనం జరిగినట్లు సమాచారం.