Begin typing your search above and press return to search.

కరోనా సోకిన ఆ తల్లి మరణించింది .. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు !

By:  Tupaki Desk   |   14 April 2021 3:30 PM GMT
కరోనా సోకిన ఆ తల్లి మరణించింది .. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు !
X
కరోనా .. ఈ మహమ్మారి మానవ సంబంధాల మధ్య దూరం పెంచుతుంది. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని పూర్తిగా చంపేసింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే .. ఇందులో ఏదీ కూడా తప్పు లేదు అని చెప్పాలి. కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వైరస్‌ సోకిన వారిని అంటరాని వారిని చూసినట్టు చూసేవారు. కానీ, రోజులు జరిగేకొద్ది వైరస్‌పై అవగాహన పెరిగింది. కరోనా సోకితే అదేదో అనర్థాలు జరుగుతాయన్న భయం తొలగిపోతుంది. కానీ, కొంతమంది మాత్రం ఇంకా, ఏదో జరిగిపోతుందన్నట్లు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఆదుకుని అండగా ఉండి , గుండెధైర్యం చెప్పి బాగా చూసుకోవాల్సిన వారే, అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారివల్లే జమ్మికుంటలో ప్రాణాలు కోల్పోయింది ఓ తల్లి.

వివరాల్లోకి వెళ్తే .. జమ్మికుంటకు చెందిన 50 ఏళ్ల సుశీల అనే ఓ మహిళకి కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి యజమాని ఇంటి నుంచి పంపేశాడు. యజమాని చీత్కారంతో ఆమె బతుకు రోడ్డుపై పడింది. పోనీ ఆమె ఎవరూ లేని ఆనాథ కాదు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా కనీసం వారు కూడా పట్టించుకోలేదు. దీనితో ఇంతకాలం కూరగాయలు అమ్ముకున్న తోపుడు బండే ఇంటిగా మారింది. ఓ వైపు విషమిస్తున్న ఆరోగ్యం , మరోవైపు ఇంత మంది ఉన్నా అభాగ్యురాలిగా మిగిలిపోయానన్న మానసిక ఆవేదన, దీంతో ఆమె మరింతగా కుంగిపోయింది. సరైన తిండి లేక, చికిత్స లేక, రెండు రోజుల పాటు ఆ తోపుడు బండిపైనే ఉంది. అంతటితో ఆగలేదు ఆమె కష్టాలు.

కరోనా బాధితురాలు అని తెలియడంతో.. మార్కెట్‌ నుంచి గెంటేశారు స్థానికులు. చేసేదేం దగ్గర్లోనే ఉన్న ఫ్లైఓవర్ కిందకు తోసుకెళ్లి పడుకుంది. ఆ తోపుడు బండిపైనే రెండు రోజుల పాటు ఉండిపోయింది. కనీసం పట్టించుకున్న నాథుడే లేడు, రోడ్డుమీద వెళ్లేవారు కూడా పాపమనలేదు, ఆమె ఓ కరోనా బాధితురాలు అని తెలిసినా. రెండు మందులు ఇచ్చి పంపారే తప్పా, ఐసోలేషన్‌ లో పెట్టలేదు. చివరికి రెండు రోజుల తర్వాత స్థానికులు దయతలచడంతో ఆమెను కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కరోనా తీవ్రం కావడంతో , సరైన ఆహారం లేకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుశీల మరణించింది. బహుశా కరోనా వైరస్ కంటే కన్న కొడుకులు పట్టించుకోలేదన్న వేదన. సమాజం చీత్కారాలే ఆమె ప్రాణం తీసి ఉంటాయి. కరోనా పేషెంట్లకు కష్టకాలంలో సాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ, వారిని వెలివేయవద్దు. చీదరింపులు, ఛీత్కారాలకు గురిచేయవద్దు. సాటి మనుషుల పట్ల కాస్త మానవత్వం చూపించగలిగితే అదే చాలు. రేపు ఎవరికైనా అదే పరిస్థితి ఎదురుకావొచ్చు. కాబట్టి కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపకుండా ఆపదలో వారికి కాస్త సహాయం చేయండి.