Begin typing your search above and press return to search.

104కి కాల్ చేసిన ఎంపీ విజయసాయి.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ?

By:  Tupaki Desk   |   1 May 2021 6:30 AM GMT
104కి కాల్ చేసిన ఎంపీ విజయసాయి.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ?
X
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. తాజాగా నిన్న ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం .. 17 వేలకుపై గా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్ర‌భుత్వం తగిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసి కరోనా ప్రత్యేక ఆస్ప‌త్రుల సంఖ్య‌ను పెంచింది. ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మ‌రోవైపు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కరోనా కేర్ సెంట‌ర్లు, ఆస్పత్రులు, పడకలు, అంబులెన్స్‌ ల వివరాల కోసం 104 కాల్‌ సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. హోమ్ ఐసొలేషన్, హోమ్ క్వారంటైన్‌, వ్యాక్సినేషన్ సెంట‌ర్ల‌ వివరాల సేవలకు 104 కాల్‌ సెంటర్ల పని చేస్తున్నాయి. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణకు స్పెష‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియమించారు. 104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం చెప్తుంది. 104కు కాల్ చేసిన వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అయితే , ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టు నిజంగానే 104 కాల్ సెంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయా , ప్రజల కష్టాలను పట్టించుకుంటున్నాయా అంటే అసలు చాలా వరకు 104 కాల్ సెంటర్ కి కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదనేది కంప్లైన్ట్. అలాగే నెంబర్ కలిసినా కూడా కొందరు సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదనే ఫిర్యాదులు కూడా భారీగానే ఉన్నాయట. దీనితో 104 పని వ్యవహార తీరుని పరిశీలించడానికి రంగంలోకి దిగిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది.
ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ పర్యటన లో భాగంగా కలెక్టరేట్‌ లోని 104 కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లారు. అయితే ఆయన వచ్చిన 20 నిముషాల సమయంలో 104 కి ఒక్క కాల్‌ కూడా రాకపోవడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.

దీంతో ఆయనే స్వయంగా 104 పనితనం తెలుసుకోవాలి అనుకన్నారు. వెంటనే ఆలస్యం చేయకుండా 104కి ఫోన్‌ చేశారు. అయితే ఆ కాల్ మాత్రం కనెక్ట్ కాలేదని సమచారం. దీంతో విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సర్వర్‌లో సాంకేతికలోపం ఉందని, అందుకే 104 కాల్ కలవలేదని అధికారులు చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే సమస్యను పరిష్కరించాలని , ప్రజలకి ఉపయోగపడే 104 కాల్ సెంటర్ పని చేయకపోతే ఎలా అని అధికారులపై మండిపడ్డారు.