Begin typing your search above and press return to search.

ఉద్యోగ నేతలను టార్గెట్ చేసిన ఎంపి

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:30 AM
ఉద్యోగ నేతలను టార్గెట్ చేసిన ఎంపి
X
పీఆర్సీ సాధన సమితి నేతలు నలుగురిని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘరామకృష్ణంరాజు టార్గెట్ చేస్తున్నారు. ఉపాధ్యాయులను, ఉద్యోగులను బాగా రెచ్చగొడుతున్నారు. వెంటనే ఆ నలుగురు నేతలను వదిలించుకోవాలని పిలుపిచ్చారు. భారీ ఎత్తున ఉద్యమం చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సాధించిందేమిటో చెప్పాలని నిలదీశారు. ఆ నలుగురు నేతలు ప్రభుత్వం కాళ్ళబేరానికి వెళ్ళటంతోనే ఆందోళన నీరుగారి పోయిందన్నారు.

ఆ నలుగురిలో ఒకరైన వెంకట్రామరెడ్డి స్పష్టంగా పార్టీ మనిషే అన్నారు. అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ మద్దతుదారుడట. ఉద్యోగ విరమణ వయసు పెరగటంతో బండి శ్రీనివాసరావు అలిసిపోయేలా డ్యాన్స్ చేశారని ఎంపీ ఎద్దేవా చేశారు. ముగ్గురి గురించి మాట్లాడిన ఎంపీ నాలుగో నేత సూర్యనారాయణ గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. కాకపోతే గతంలో చంద్రబాబునాయుడు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలని అడిగిన సూర్యనారాయణ ఇపుడు 23 శాతానికి జగన్మోహన్ రెడ్డికి ఎలా కృతజ్ఞతలు చెప్పారంటు ప్రశ్నించారంతే.

ఉద్యోగ సంఘాల నేతల్లో ఒకరు అమరావతి ప్రాంతంలో ఎకరం స్ధలం కొన్నారట. కాబట్టి ఆ కేసు ఏమవుతుందో అని ఆయన భయపడుతున్నట్లు ఎంపీ ఎద్దేవా చేశారు. కాబట్టి ఈ నలుగురు నేతలను వెంటనే ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు వెంటనే వదిలించుకోవాలని సూచించారు. మెరుగైన ఫిట్మెంట్ సాధించేందుకు ఉపాధ్యాయులు పోరాటం చేయటంలో తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉద్యోగుల ఆందోళన మానుకుని, సమ్మె విరమించుకోగానే రాజకీయ పార్టీలు సీన్ లోకి ఎంటరైపోయాయి. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, వామపక్షాలు డైరెక్టుగానే మద్దతు ప్రకటించేశాయి. లెఫ్ట్ పార్టీల నేపథ్యమున్న ఉపాధ్యాయ ఎంఎల్సీలైతే ఉపాధ్యాయులను ఆందోళనలు, సమ్మెలు చేయాలని పిలుపిచ్చారు. ఉపాధ్యాయుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అటు చేసి ఇటుచేసి అందరూ ఆ నలుగురు ఉద్యోగుల నేతలను మాత్రమే టార్గెట్ చేస్తుండటం గమనార్హం.