Begin typing your search above and press return to search.

కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నానికి అంబేడ్క‌ర్ పేరు.. కేటీఆర్ తీర్మానం

By:  Tupaki Desk   |   13 Sep 2022 7:30 AM GMT
కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నానికి అంబేడ్క‌ర్ పేరు.. కేటీఆర్ తీర్మానం
X
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును టీఆర్ ఎస్ ఇరికించేసింది. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని తెలంగాణ‌ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తీర్మానం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి, సమానత్వమే అసలైన ప్రజాస్వామ్యమన్న వ్యక్తి. స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని.. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అయిన పార్లమెంట్‌కు పేరు పెట్టడానికి ఆయన పేరుకంటే మించినది ఏదీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అనంత‌రం మంత్రి కేటీఆర్ శాసనసభలో పార్ల‌మెంటుకు అంబేడ్క‌ర్ పేరు పెట్టాల‌నే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అంబేడ్కర్ గొప్పదనం గురించి కేసీఆర్ చాలాసార్లు చెప్పారని గుర్తుచేశారు. దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు.

అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్ నడుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం సాధించాలని అంబేడ్కర్ చెప్పారని తెలిపారు. అవి లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని ఆయన అభిప్రాయపడినట్లు వెల్లడించారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని పేర్కొన్నారు.

"అంబేడ్కర్ తత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆచరణలో చూపింది. ఆయన లక్ష్యం సమానత్వం. తాను రాసిన రాజ్యాంగ దుర్వినియోగం అయితే స్వయంగా తానే దాన్ని తగులబెడతానని ఆయన అన్నారు. భాషా ఆధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఆయన వ్యతిరేకించారు.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి పేరు పెట్టడానికి ఆయనకంటే మించిన, సరైన వ్యక్తి లేరు. అందుకే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి." అని మంత్రి కేటీఆర్ అన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.