Begin typing your search above and press return to search.

నవ యువ సూపర్ స్టార్ ఎంబాపె.. వచ్చే 3 ప్రపంచ కప్ లు అతడివే

By:  Tupaki Desk   |   20 Dec 2022 7:30 AM GMT
నవ యువ సూపర్ స్టార్ ఎంబాపె.. వచ్చే 3 ప్రపంచ కప్ లు అతడివే
X
పొడవైన మనిషి.. బలమైన శరీరం.. అంతే వేగంగా కదలికలు.. పాస్ అందిస్తే కచ్చితంగా చేరాల్సిందే.. ఏ అవకాశమూ వదలడు.. గోల్ పోస్ట్ దగ్గరకు చేరాడంటే ప్రత్యర్థుల్లో గగ్గోలే.. అతడే కిలియన్ ఎంబాపె.. రాసిపెట్టుకోవచ్చు.. వచ్చే పదేళ్లు అతడిదే రాజ్యం.. ఎందుకింత కచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే.. ఎంబాపె సామర్థ్యం అలాంటిది. ఇదేదో తాజా ప్రపంచ కప్ ప్రదర్శన ఆధారంగా చెబుతున్న మాట కాదు.. 2018లో రష్యాలో జరిగిన ప్రపంచ కప్ లోనే ఎంబపె సత్తా ఏమిటో తెలిసింది.

నాడు 19 ఏళ్ల కుర్రాడిగా.. నేడు యువకుడిగా 2018 ప్రపంచ కప్ లో ఫ్రాన్స్ బలమైన జట్టే కానీ.. కప్ సాధిస్తుందని ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అయితే, ఎప్పుడైతే ఎంబపెను పూర్తిస్థాయిలో వాడుకోవడం మొదలుపెట్టిందో అప్పట్నుంచే ఆ కప్ లో ఫ్రాన్స్ దూకుడు పెరిగింది. చిరుతలా కదిలే ఎంబపె మ్యాచ్ ఫలితాలనే మార్చేశాడు. గత టోర్నీలో అలా అతడు నాలుగు గోల్స్ కొట్టాడు. టోర్నీలో ఉత్తమ యువ ఆటగాడిగానూ నిలిచాడు. ఈసారి అత్యుత్తమ ఆటగాడిగా ప్రపంచ కప్ బరిలో దిగాడు. పరిపూర్ణమైన ఆటతీరుతో ఏకంగా 8 గోల్స్‌ కొట్టి'బంగారు బూటు' అందుకున్నాడు. 23 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఎంబపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం.

ఎందుకంత ప్రత్యేకం..? గొప్ప ఆటగాడికి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఎంబపెలో ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గది మ్యాచ్ ఓడిపోతున్నామని తెలిసీ పట్టు వదలకపోవడం. అర్జెంటీనాతో ఫైనల్స్ లో 79వ నిమిషం వరకు ఫ్రాన్స్ 0-2తో వెనుకబడి ఉంది. ఫుట్ బాల్ మేధావులే కాదు.. ప్రేక్షుకులు, టీవీల ముందున్న అభిమానులు అందరూ ఫ్రాన్స్ పనైపోయిందని భావించారు. కానీ, ఎంబపె వదల్లేదు. ఏ మాత్రం అవకాశం చిక్కినా మ్యాచ్ ను లాగేసుకోవచ్చనేది అతది ఆలోచన. అలానే చేశాడు కూడా. అందుకే.. నిర్ణీత 90వ నిమిషాల్లో (ప్లస్ వేస్ట్ అయిన సమయం కలుపుకొని) అయిపోతుందనుకున్న మ్యాచ్ అదనపు సమయానికి, ఆపై పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లింది. ఈ అదనపు సమయంలో, పెనాల్టీ షూటౌట్ లో ఎంబపె ఆటతీరును చూస్తే అర్జెంటీనా ఆశలు గల్లంతే అనిపించింది. దీన్నిబట్టే చెప్పొచ్చు ఎంబపె ప్రతిభ ఎంతో.

ఆ కాళ్లు కామెరూన్ వి.. ఫ్రాన్స్ ఫుట్ బాల్ జట్టంటే ఆఫ్రికా జట్టనే చెడ్డ పేరుంది. ఇది కొంత వాస్తవమే. తాజా ప్రపంచ కప్ తో పాటు గత ప్రపంచ కప్ లోనూ ఫ్రాన్స్ జట్టును చూస్తే ఇది తెలిసిపోతుంది. కానీ, అంతర్జాతీయ స్థాయిలో అందరి ఆమోదం పొంది మైదానంలో దిగాక ఇక వేరే మాట ఉండదు. కాగా, ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ఎంబపె తండ్రిది కామెరూన్. తల్లిది అల్జీరియా. వలస వచ్చి పారిస్‌ శివారులోని బాండీకి వచ్చి స్థిరపడ్డారు. ఫుట్‌బాల్‌ ఆటగాడైన విల్‌ఫ్రైడ్‌ తర్వాత కోచ్‌గా మారాడు. అతడి భార్య ఫైజా హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణి. అలా పేదరికంలో పెరిగిన ఎంబపె జీన్స్ లోనే ఫుట్‌బాల్‌ ఉంది. దీంతో చదువు కంటే కూడా ఆటకే విలువ ఎక్కువ అని నమ్మి కొడుకును విల్‌ఫ్రైడ్‌ ప్రోత్సహించాడు. ఆటలో ఓనమాలు నేర్పాడు. తాను పనిచేసే ఏఎస్‌ బాండీ క్లబ్‌లో ఆడించాడు.

అప్పట్లో మొనాకోకు.. ఇప్పుడు ఫ్రాన్స్ కు ఆటపై పట్టు సాధించిన ఎంబపె మొదట్లో రెండేళ్లు మొనాకోకు ఆడాడు. 2017లో పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌ (పీఎస్‌జీ) క్లబ్‌తో చేరాడు. మంచి దేహ ధారుఢ్యం అతణ్ని మిగతా ఆటగాళ్లకు భిన్నంగా నిలుపుతోంది. అతను స్పెయిన్‌ దిగ్గజ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌కు మారకుండా పీఎస్‌జీతోనే కొనసాగేలా చూడడం కోసం స్వయంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ జోక్యం చేసుకున్నారంటే ఎంబపె విలువ ఏమిటో అర్థమవుతోంది.

మెస్సీ శకం ముగిసింది.. రొనాల్డో తరం అయిపోయింది ఇప్పుడు మెస్సీ శకం ముగిసింది. ప్రపంచ కప్ తో అతడి కల కూడా నెరవేరింది. రొనాల్డో శకం ఎలాగూ క్వార్టర్స్ తోనే అయిపోయింది. మెస్సీకి 35 ఏళ్లు. వచ్చే ప్రపంచ కప్ మాత్రం ఆడడు. రొనాల్డో ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగడు. ఇకపై ప్రపంచ ఫుట్ బాల్ ను శాసించేది ఎవరూ అంటే.. ఒక్కడే. అతడే ఎంబపె. ఆఫ్రికన్లలో ఉండే సహజ నైపుణ్యాన్ని సానబెడితే వచ్చిన వజ్రం అతడు. కనీసం మూడు ప్రపంచ కప్ లు (2026, 2030, 2034) అయినా ఆడగల సత్తా ఉన్నవాడు. వీటిలో ఒక్కటైనా ఫ్రాన్స్ ఖాతాలో వేయగల దమ్మూ ఉన్నవాడు. కాబట్టే ఎంబపెను అందరూ భవిష్యత్ సూపర్ స్టార్ గా లెక్కేస్తున్నారు.

నెయ్ మార్ ఉన్నప్పటికీ బ్రెజిల్ కు చెందిన నెయ్ మార్ గొప్ప ఆటగాడు. 2014 ప్రపంచ కప్ నుంచి అతడిపై భారీ అంచనాలు. అయితే, నెయ్ మార్ కు గాయాల బెడద ఎక్కవు. 2014లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ లో అతడు నాకౌట్ దశలో గాయపడ్డాడు. దీంతో సెమీస్ కు అందుబాటులో లేడు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న జర్మనీ విరుచుకుపడి 7 గోల్స్ కొట్టి బ్రెజిల్ ను ఇంటికి పంపింది. ఇక గత రెండు ప్రపంచ కప్ లలో అతడు రాణించింది తక్కువే. ఈసారి కూడా లీగ్ దశలో గాయపడ్డాడు. కానీ ఎంబపె అలా కాదు. ఫామ్, ఫిట్ నెస్ రెండింట్లోనూ సూపర్. కాగా, అర్జెంటీనాకు చెందిన అల్వారెజ్, ఫెర్నాండెజ్ కూడా ప్రతిభ గల ఆటగాళ్లే. పోర్చుగల్ కుర్రాడు రామోస్ పైనా మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, వీరంతా ఎంబపెను దాటేసేంత సత్తా ఉందని నిరూపించాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.